Vaikunta Ekadasi 2023 Date and Pooja Vidhanam: ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైనది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అయితే.. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. ఈ సందర్భంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది..? వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..? పూజా విధానం ఏంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైకుంఠ ఏకాదశి ఎప్పుడు:మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?
ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకోవాలి:వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం.. ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.