Teaching under streetlights:గుజరాత్ వడోదరాకు చెందిన ఇంజినీర్ నికుంజ్ త్రివేది మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవితాల్లో చీకట్లను తరిమేస్తున్నారు. వీధి లైట్ల వెలుతురులో చదువు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలో ఎవరికైనా విద్యను అందించడమే అత్యుత్తమ బహుమతి అని భావించే నికుంజ్ త్రివేది.. తనకున్న జ్ఞానాన్ని పిల్లలకు పంచుతున్నారు. వీధుల్లో బడికి పోకుండా ఉండే చిన్నారులకు.. ఉదయమంతా ఉద్యోగం చేసి సాయంత్రం పాఠాలు బోధిస్తున్నారు. వడోదరా కరేలిబాగ్ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై నివసించే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. 8 నెలల క్రితం ఐదుగురు పిల్లలతో ఉచిత విద్య అందించడం ప్రారంభించిన నికుంజ్ త్రివేది వద్ద ప్రస్తుతం 90 మంది వరకు చదువుకుంటున్నారు.
నికుంజ్ త్రివేది తన ఆదాయంలో 25 శాతం సంపాదనను ఈ విద్యార్థులకు సాయం చేసేందుకు వినియోగిస్తారు. విద్యార్థుల స్కూలు ఫీజులు కూడా నికుంజ్ చెల్లిస్తున్నారు. వారి పుస్తకాలకు కూడా తన సంపాదనలో కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం విద్య చాలా ఖరీదుగా మారిందని, నిరుపేద తల్లిదండ్రులు ఆ ఖర్చులను భరించే స్థితిలో లేరని త్రివేది అన్నారు. వారి కష్టాలకు పిల్లలు చదువులకు దూరం కావద్దనే.. తన వంతు సాయం చేస్తున్నానని తెలిపారు. మురికివాడల పిల్లలకు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఉచిత విద్య అందిస్తానని తెలిపారు. పిల్లలకు విద్య అందించేందుకు తొలుత ఓ ఎన్జీఓలో చేరిన త్రివేది.. కరోనా కారణంగా అది మూతపడడంతో సొంతంగా పాఠాలు బోధిస్తున్నారు.