అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాంతకంగా మారే డెంగీ జ్వరానికి మన దేశంలో తొలిసారి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా తాను అభివృద్ధి చేసిన డెంగీ టీకాను (Dengue Vaccine Takeda) మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)తో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. దీనికి సానుకూల స్పందన లభిస్తే వెంటనే టీకా అందుబాటులోకి తీసుకురావటానికి తకేడా ఫార్మా (Dengue Vaccine Takeda) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. డెంగీకి టెట్రావాలెంట్ లైవ్ అటెన్యుయేటెడ్ టీకా (టక్-003)ను ఈ ఔషధ సంస్థ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతినివ్వాలని తకేడా ఫార్మా ఇప్పటికే పలు ఐరోపా దేశాల్లో దరఖాస్తు చేసింది. అదే సమయంలో వివిధ ఆసియా దేశాల్లో ఈ టీకా విక్రయానికి ప్రయత్నిస్తోంది. తకేడా ఫార్మా ప్రపంచవ్యాప్తంగా 20 పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటి. క్యాన్సర్, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ ఔషధాలతోపాటు కొన్ని అరుదైన వ్యాధులకు మందులు ఆవిష్కరించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది.
ఎదురుచూపులు
డెంగీ టీకా (Dengue Vaccine Dose) కోసం మనదేశమూ ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. దీన్ని ఆవిష్కరించడానికి దేశీయ ఫార్మా/బయోటెక్ కంపెనీలు శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాయి. పానేషియా బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బయోలాజికల్ ఇ.లిమిటెడ్ తదితర దేశీయ సంస్థలన్నీ యూఎస్ ఎన్‌ఐహెచ్ (యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) నుంచి 'నాన్-ఎక్స్‌క్లూజివ్' పద్ధతిలో టెట్రావ్యాక్స్-డివి అనే డెంగీ టీకా లైసెన్సు తెచ్చుకొని దాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయోగాలు 'ల్యాబ్' దశలోనే ఉన్నాయి.
సనోఫీ ముందడుగు