తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Vaccine: టీకాతో రక్షణ ఎంత కాలం?

కరోనా బాధితులకు టీకా వేయడం వల్ల.. వారు వైరస్​ నుంచి దీర్ఘకాలికంగా రక్షణ పొందొచ్చని ఓ అధ్యయనం తెలిపింది. వారిలో సహజ నిరోధక శక్తి పెరిగి.. కరోనాకు కారణమయ్యే వైరస్​ను తటస్థీకరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉంది. యాంటీబాడీలను దీర్ఘకాలం శరీరం ఉత్పత్తి చేయొచ్చన్న ఆశలకు.. ఈ పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి.

Vaccines boost natural immunity against COVID-19
కరోనా బాధితులకు టీకాతో వైరస్​ నుంచి జీవితకాల రక్షణ

By

Published : Jun 1, 2021, 2:21 PM IST

కొవిడ్‌-19 మహమ్మారి కట్టడిపై పలు పరిశోధనలు సరికొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారు లేదా కరోనా టీకా తీసుకున్నవారికి ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించొచ్చని అవి పేర్కొన్నాయి. కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి.

సహజ రోగనిరోధక శక్తి..

కరోనా సోకిన వారికి టీకాలు వేయడం వల్ల.. సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఇది.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న వైరస్ వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని పేర్కొంది.

అమెరికాలోకి రాక్​ఫెల్లర్​ యూనివర్సిటీ పరిశోధకులు.. కొవిడ్​ బాధితుల రక్తంలోని ప్రతిరోధకాలను విశ్లేషించి, ఈ అణువుల పరిణామాన్ని ట్రాక్​ చేశారు. రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలు.. కరోనాకు కారణమయ్యే సార్స్​ కోవ్​-2 వైరస్​ను తటస్థీకరించడంలో మెరుగ్గా పనిచేస్తున్నాయని గుర్తించారు.

మొత్తం 63 మంది ఈ పరిశోధనలో పాల్గొనగా.. ఇందులో కనీసం ఫైజర్​/మోడెర్నా టీకా మొదటి డోసు పొందిన 26 మందిలో ప్రతిరోధకాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వీరికి.. వైరస్​ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉంది.

యాంటీబాడీలు ఎంత కాలం?

కరోనా రీఇన్‌ఫెక్షన్లు శాస్త్రవేత్తలు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ఉత్పత్తయ్యే నిర్దిష్ట యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయా అన్న ప్రశ్నలు వీటివల్ల ఉత్పన్నమయ్యాయి. ఈ వ్యాధి నివారణకు ఏటా లేదా ఆరు నెలలకోసారి టీకా పొందాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. తాజా అధ్యయనాలు మాత్రం.. ఈ రోగనిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొన్నాయి. కొందరిలో ఇది కొన్ని దశాబ్దాలు కూడా కొనసాగొచ్చని తెలిపారు. కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జకూ పాత్ర ఉన్నట్లు తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు.. ఎముక మజ్జలోని రోగనిరోధక కణాలను పరిశీలించారు.

టీకా పొందిన వారితో పోలిస్తే కొవిడ్‌ నుంచి కోలుకున్నవారికి భవిష్యత్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే సమర్థత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే.. మరోసారి ఆ ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఇవి పూర్తిస్థాయిలో కాపాడతాయని నిర్ధరణగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: టీకా తీసుకోకపోతే ఉద్యోగం ఊడినట్టేనా?

ABOUT THE AUTHOR

...view details