Vaccine Restrictions: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రతి ఒక్కరు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం 'నో జాబ్.. నో సాలరీ' పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. టీకా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఉండవన్న మాట. ఉద్యోగులు సింగిల్ డోసు లేదా డబుల్ డోసు తీసుకున్నవారు తమ టీకా ధ్రువీకరణ పత్రాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. అందుకు సంబంధించిన మెడికల్ పత్రాలను చూపించాలని తెలిపింది.
నో ఎంట్రీ..
Haryana Vaccine Restrictions: కరోనా టీకాలు తీసుకోని వారిపై హరియాణా కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లో తిరగటాన్ని నిషేధించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
ఈ నిబంధనల ప్రకారం.. ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి ఉండదని మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.
హరియాణాలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడలేదు. అయినప్పటికీ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 11 లక్షల టీకా డోసులు పంపిణీ జరిగింది.
ఆంక్షల చట్రంలోకి దిల్లీ..
Covid Restrictions in Delhi: దేశంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు పాటిస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఉన్నందున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనం గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది.