దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మరిన్ని సమూహాలకు టీకాలు వేయాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా చిన్నవయసు వారిని దీని కిందికి తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆ విషయంలో టీకా లభ్యత కీలకాంశం కానుందని వెల్లడించారు.
"మనది జనాభా పరంగా పెద్ద దేశం. వయోజనులందరికీ అంటే.. సుమారు 100 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అందుకోసం 200 కోట్ల టీకా డోసులు అవసరం. కాకపోతే అన్ని టీకా డోసులను పొందే అవకాశం లేదు. అందుకే టీకా సమతుల్యతను పాటిస్తూ.. ప్రాధాన్య వర్గాలకు టీకాలు అందించాల్సిన అవసరం ఉంది."
-- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్