కరోనాకు వ్యతిరేకంగా దీర్ఘకాల రక్షణ సాధ్యం కావాలంటే టీకా పంపిణీనే ఉత్తమ మార్గమమని నిపుణులు స్పష్టం చేశారు. యాంటీబాడీల ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుందని, టీ-కణాల ద్వారా వచ్చే రోగనిరోధకత దీర్ఘకాలం పాటు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన రాజీవ కరందికార్, సీఎస్ఐఆర్ డీజీ శేఖర్ మండే, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఎం విద్యాసాగర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
రెండు సీరోలాజికల్ సర్వేలు, ఇతర అధ్యయనాల ప్రకారం.. భారత్లోని కొంతభాగం జనాభాకు కరోనాకు రోగనిరోధకత ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇది సహజంగా వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం.. యాంటీబాడీల వల్ల వచ్చే ఇమ్యూనిటీ కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. టీ-కణాల ద్వారా వచ్చే రోగనిరోధకత సుదీర్ఘంగా ఉంటుంది. ఎక్కువకాలం నమ్మకమైన ఇమ్యూనిటీ ఉండాలంటే వ్యాక్సినేషన్ ద్వారానే సాధ్యం."