దేశంలో 60 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ ప్రక్రియ గత కొద్ది వారాలుగా నెమ్మదిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం 2.29 కోట్ల మంది వృద్ధులే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని తన నివేదికలో పేర్కొంది. సింగిల్ డోసు అందుకున్న వారి సంఖ్య 6.71 కోట్లగా ఉన్నట్లు తెలిపింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 2 మధ్య వారానికి 80.77 లక్షల సగటున వృద్ధులకు టీకా పంపిణీ జరిగేదని.. జూన్ 5 నుంచి 25 మధ్య అది 32 లక్షలకు పడిపోయినట్లు పేర్కొంది.
60 ఏళ్లు దాటిన వారు దేశంలో 14.3 కోట్లు ఉంటారని కేంద్రం అంచనా. ఈ లెక్కన ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 16 శాతం మాత్రమే.
నిపుణుల ఆందోళన..
వృద్ధుల్లో టీకా పంపిణీ తగ్గడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి 60 ఏళ్లు దాటిన వారే తీవ్రంగా ప్రభావితం అవుతారని తెలిపారు. టీకా పంపిణీ కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడటం సహా వ్యాక్సిన్‌పై అపోహలే వ్యాక్సినేషన్ నెమ్మదించడానికి కారణం అని అభిప్రాయపడుతున్నారు.
"కొవిడ్ వ్యాప్తిపై చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఆ వైరస్ పట్టణానికే పరిమితం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పలువురు ప్రజల అభిప్రాయం. కొవిడ్ తమకు సోకదని కొందరు ధీమాగా ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇలా వైరస్, వ్యాక్సిన్ల పట్ల అనేక అపోహలు, దురాభిప్రాయాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తున్నాయి."