- దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలోని 37మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం గతవారం ఆస్పత్రిలో చేరారు. ఆ డాక్టర్లలో ఎక్కువ మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే.
- దిల్లీలో ఇటీవల మొదటి డోసు తీసుకున్న 54ఏళ్ల ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. టీకా వేసుకున్న రోజు నీరసంగా ఇంటికి వచ్చాడని అతడి కుమారుడు ధీరజ్ అన్నాడు. ఆ తర్వాత విపరీతమైన జ్వరం వచ్చిందని, మూడు రోజులకు చనిపోయినట్లు వివరించారు.
- చెన్నైలో మార్చిన 15న మొదటి డోసు తీసుకున్న లబ్ధిదారుడికి.. అదే నెల 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఏప్రిల్ 4న అతడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు టీకా సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీ, చెన్నైతో పాటు.. పాట్నా లాంటి టైర్-2 నగరాల్లో ఇలా కరోనా సోకిన వ్యాక్సినేషన్ లబ్ధిదారుల సంఖ్య నెల రోజులుగా పెరిగిపోతోంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుల్లో స్వల్ప ప్రతికూలతలు ఎదురయ్యాయి. కొందరి విషయంలో అవి తీవ్రమై.. ఆస్పత్రిలో చేరడానికి దారి తీసిననట్లు తెలుస్తోంది.
అయితే కేంద్రం మాత్రం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెండూ తీసుకోవడం సురక్షితమని చెబుతోంది. దుష్ప్రభావాలు వస్తున్నాయన్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరుతోంది.
నిపుణులు ఏమన్నారంటే
టీకాలు వైరస్ నుంచి రక్షించడానికి పూర్తస్థాయి కవచాన్ని నిర్మించలేవని నిపుణులు అంగీకరించారు. అయితే వైరస్ తీవ్రతను వ్యాక్సిన్ తగ్గిస్తుందని, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుందని వెల్లడించారు.
"టీకా రెండు డోసులను తీసుకున్న వారికి కూడా కరోనా సోకినట్లు మాకు తెలుసు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. లబ్ధిదారులకు కొవిడ్ సొకితే సంక్రమణ తీవ్రత, ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. పూర్తి స్థాయిలో వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం రెండు డోసులు తీసుకున్న తర్వాతే వస్తుంది."
-డాక్టర్ అవధేష్, పల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి, బన్సల్