కరోనా కట్టడిలో టీకానే కీలకమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రోజువారి టీకాల పంపిణీని మరింత తగ్గిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని ఆయన కోరారు. అప్పుడే టీకా దేశంలోని ప్రతి గ్రామానికి చేరుతుందని తెలిపారు. అయితే ఇంత చిన్న లాజిక్ కూడా మోదీ సర్కారుకు అర్థంకావడం లేదని అన్నారు.
ఏప్రిల్ నుంచి మే 20 వరకు టీకాల పంపిణీ తగ్గుముఖం పట్టినట్లు కనిపించే గ్రాఫ్‌ను ఆయన షేర్ చేశారు. రోజువారి టీకాల ఉత్పత్తితో పోల్చితే.. పంపిణీ చేసే టీకాల సంఖ్య తక్కువగా ఉందన్న అంశాన్ని గుర్తు చేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు.
"టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కొవిడ్‌ను అడ్డుకోవడానికే టీకా ఒక్కటే సరైన మార్గం. అందుకే దేశంలోని ప్రతి పల్లెకు టీకాలు అందుబాటులోకి తీసుకురావాలి. అదే విషయాన్ని కేంద్రం అర్థం చేసుకుంటే మంచిది."