కరోనా రెండో దశ సృష్టించిన అల్లకల్లోలం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పు వార్తలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇక డెల్టా వేరియంట్ ఇప్పటికీ కలవరపెడుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. ప్రజల నిర్లక్ష్యం నిత్యం కనపడుతూనే ఉంది. కరోనా కట్టడికి ప్రధాన ఆయుధాలైన మాస్కులు, భౌతికదూరాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా ప్రజలు రోడ్ల మీద కనపడుతున్నారు.
ఇక రాష్ట్రాల్లో నిబంధనలు సడలించిన క్రమంలో.. అప్పటివరకు ఇళ్లల్లో ఉన్న ప్రజలు అదే పని మీద ప్రయాణాలు మొదలుపెట్టేశారు. పర్యటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. కరోనాకు ముందు ఇది మంచి విషయమే. కానీ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పర్యటక ప్రాంతాల్లో రద్దీ తీవ్ర కలవరపెడుతోంది. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు ఆయా ప్రాంతాలకు పోటెత్తడానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి.
ఇక మూడో దశలో చిన్నారులకు ముప్పు పొంచి ఉందని అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇది నిర్లక్ష్యంగా ఉండాల్సిన సమయం కాదు. పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. పిల్లలతో పాటు పెద్దలు కూడా త్వరితగతిన టీకాలు వేయించుకోవాలి. ఇతరులను టీకా వేసుకునే విధంగా ప్రోత్సహించాలి. మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటిస్తేనే మూడో దశ తీవ్రత తగ్గుతుంది. అప్పుడే దేశం కరోనా గండం నుంచి బయటపడుతుంది.