దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. 2021 డిసెంబర్ కన్నా ముందే టీకా పంపిణీ (Vaccination) పూర్తవుతుందని తెలిపారు.
"వ్యాక్సిన్ (corona vaccine) గురించి ఎలాంటి వివాదం లేదు. డిసెంబర్ నాటికి 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయి. 108 కోట్ల మందికి ఎలా టీకా అందించాలనే ప్రణాళిక పూర్తయింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్(Covaxin), జైడస్ క్యాడిలా, నొవావాక్, జినోవా, స్పుత్నిక్ వంటి స్వదేశీ, విదేశీ టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ విధంగా వస్తాయి అనేది పూర్తిగా ఇందులో ఉంది. అవి మొత్తం 216 కోట్ల డోసులు రాహుల్ జీ. 2021, డిసెంబర్ కన్నా ముందే భారత్‌లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. "
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
వ్యాక్సినేషన్ గురించి ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టింది భాజపా. ఆయన మాట్లాడుతున్న శైలి, భయాలను ప్రేరేపించేందుకు చేస్తున్న ప్రయత్నం.. టూల్‌కిట్ వెనకాల ఆయన పార్టీ ఉన్నట్లు ధ్రువీకరిస్తోందని పేర్కొంది. కొవిడ్ కట్టడికి మోదీ కృషి చేస్తున్న తరుణంలో ఆయన జిమ్మిక్ చేస్తున్నారని వ్యాఖ్యానించటం టూల్‌కిట్ స్క్రిప్ట్‌లో ఒక భాగమేనని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. దేశ ప్రజలను గాంధీ అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 20 కోట్ల డోసుల పంపిణీతో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ నిలిచిందన్నారు. ఆగస్టు నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వారికి కేటాయించి కోటాను సైతం ఉత్పత్తిదారుల నుంచి తీసుకోకపోవటంపై దృష్టి సారించాలని ఎద్దేవా చేశారు.