Vaccination in India: కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాయని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఆదివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టీకా పంపిణీ కోసం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
"దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ఆరోగ్య కార్యకర్తలు అక్కడికి టీకాలు పంపిణీ చేయడం వంటి సందర్భాలు చూసినప్పుడు మనకు గర్వంగా ఉంటుంది. మహమ్మారిపై పోరుకు భారత్ ఎప్పుడు శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ప్రతీ పౌరుడికి మెరుగైన చికిత్స అందేలా మౌలికవసతులను తీర్చిదిద్దుతున్నాం అన్నారు మోదీ.
షా ప్రశంసలు
దేశంలో టీకా పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. సమర్థవంతమైన నాయకత్వం, నిబద్ధతతో ప్రధాని చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.