తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vaccination for Children: జనవరి 3 నుంచి పిల్లలకు టీకా - బూస్టర్ డోసు న్యూస్

Vaccination for Children: దేశంలో పిల్లలకు(15-18 ఏళ్లు) కొవిడ్ టీకా కార్యక్రమాన్ని జనవరి 3 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు' టీకా అందించనున్నామని తెలిపారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ ప్రకటన చేశారు.

modi
మోదీ

By

Published : Dec 26, 2021, 3:47 AM IST

Vaccination for Children: దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి ఆయన టీవీ ఛానళ్ల ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకు సాధించిన పురోగతిని, ఇకపై చేపట్టబోయే చర్యల్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా పిల్లల టీకాలపై ప్రకటన వెలువరించారు. ఇంతవరకు అందరూ బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతుండగా ప్రధాని తొలిసారిగా 'ప్రికాషన్‌ డోసు' అనే పదబంధాన్ని ప్రయోగించారు.

PM Modi on Covid:

మన జాగ్రత్తలే ఆయుధం

వ్యక్తిగత స్థాయిలో అందరం జాగ్రత్తలు తీసుకోవడమే కరోనాపై పోరాటంలో పెద్ద ఆయుధమని, ప్రపంచ అనుభవాలు ఈ అంశాన్నే చాటుతున్నాయని ప్రధాని చెప్పారు. దీని దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తల్ని ప్రజలు పాటించాలని, అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. పండగల సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. వైరస్‌కు కళ్లెం వేయడంలో టీకాల కార్యక్రమం మరో ముఖ్యమైన అస్త్రమని చెప్పారు. ముక్కు ద్వారా తీసుకునే చుక్కల టీకా త్వరలోనే మన దేశంలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా డీఎన్‌ఏ ఆధారిత టీకా కూడా మన దేశంలోనే రానుందని ప్రకటించారు.

శాస్త్రీయంగానే వెళ్తున్నాం..

'ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రజలకు టీకాలు ఇవ్వడం ప్రారంభిస్తే ప్రజల ఉమ్మడి ప్రయత్నం, సంకల్ప శుద్ధితో అనూహ్య రీతిలో 141 కోట్ల టీకా డోసుల్ని అధిగమించాం. దేశ జనాభాలో 61శాతం మంది వయోజనులకు రెండు డోసులూ అందాయి. 90శాతం పైగా వయోజనులకు కనీసం ఒక డోసు అందింది. ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న కలవరాన్ని తొలగించే రీతిలో 15-18 ఏళ్లవారికీ టీకాలు ఇవ్వబోతున్నాం. ఈ ప్రయత్నం ద్వారా పాఠశాలల్లో బోధన సాధారణ స్థితికి వస్తుంది. కరోనాపై పోరాటంలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఆరోగ్య సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికీ వారు కరోనా బాధితుల సేవకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. అందుకే వారికీ ముందుజాగ్రత్త చర్యగా టీకా డోసు వేయనున్నాం. ఇది వారిలోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. వైరస్‌ ఉత్పరివర్తనాలు చెందుతోంది. అలాంటి సవాళ్లను ఎదుర్కొనే మన విశ్వాసం కూడా మరిన్ని రెట్లు పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 18 లక్షల ఐసొలేషన్‌ పడకలు, 5 లక్షల ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. పిల్లల కోసమే ఐసీయూతో కలిపి 90,000 పడకలు ఉన్నాయి. వ్యాక్సిన్ల అవసరాన్ని తగినంత ముందే గుర్తించి, అనుమతుల నుంచి సరఫరా, పంపిణీ, శిక్షణ సహా అన్నీ సత్వరం పూర్తయ్యేలా దృష్టి సారించాం. మొదటి నుంచీ శాస్త్రీయ సిద్ధాంతాలు, శాస్త్రీయ విధానాల ప్రకారమే వైరస్‌పై పోరాడుతున్నాం. అప్రమత్తంగా ఉండడం వల్లనే సాధారణ స్థాయికి జనజీవనాన్ని తీసుకురాగలిగాం. ఇతర దేశాల కంటే మనవద్ద ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి' అని ప్రధాని చెప్పారు.

ఇదీ చదవండి:

'భారత్​ బయోటెక్'​ పిల్లల కొవిడ్​ టీకాకు డీసీజీఐ అనుమతి

Vaccine For Children: వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details