ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో ఇంటర్ విద్యార్థినిపై ఐదు నెలలుగా సాముహిక అత్యాచారం చేశారు ఆమె ప్రియుడు, స్నేహితులు. ఈ బాధను భరించలేని ఆ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి ఆమె ప్రాణాలను కాపాడింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా ప్రాంతానికి చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తరచూ తమ కోరికలు తీర్చాలని అడిగారు. లేదంటే వీడియోలు, ఫొటోలు తమ స్నేహితులకు పంపిస్తామని బెదిరించి గత ఐదు నెలలుగా బాలికను సాముహికంగా అత్యాచారం చేశారు నిందితులు.
ఇదంతా భరించలేకపోయిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి అప్రమత్తతతో ఆత్మహత్యయత్నాన్ని ఆపగలిగింది. ఇదంతా బాధితురాలి తల్లి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని గ్రేటర్ నొయిడా జోన్ అదనపు డీసీపీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇంతకుముందు నిందితులు విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారని పోలీసులు చెప్పారు.