ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. పిల్లల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే తమ అనుమతి లేకుండా పిల్లలకు పాఠశాలలో వ్యాక్సిన్ వేయించారని అందుకే వారి ఆరోగ్యం క్షీణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని థానా దాడోన్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 150 మందికి ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లారు. కాసేపటికే 50 మంది పిల్లల ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలతో నీరసంగా తయారయ్యారు. మరికొందరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అయితే తమ అనుమతి తీసుకోకుండా పిల్లలకు పాఠశాల సిబ్బంది వ్యాక్సిన్ వేయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ గేట్ మూసివేసి మరీ తమకు టీకాలు వేశారని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.