Uttarkashi Tunnel Rescue Update : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్‌క్యారా సొరంగంలోచిక్కుకున్న కార్మికులు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఓ సభ్యుడు చక్రాలు ఉన్న స్ట్రెచర్‌పై పడుకొని పైపు చివరి వరకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు. శిథిలాల గుండా వేసిన 800 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగిన పైపులోనికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి గాలి పీల్చడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. చక్రాల ఉన్న స్ట్రెచర్‌పైన విడతల వారీగా ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. పైపులో నుంచి కార్మికులను తీసుకొచ్చే సమయంలో వారికి ఎటువంటి గాయాలు కాకూడదనే ఉద్దేశంతోనే స్ట్రెచర్‌లను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు సొరంగం డ్రిల్లింగ్ పనుల్లో శుక్రవారం ఎలాంటి పురోగతి లేదని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వీలైనంత త్వరగా అగర్ మిషన్‌తో డ్రిల్లింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. గురువారం పనులు నిలిచిన తర్వాత ఎలాంటి పురోగతి లేదని.. ఇంకా సుమారు 15 మీటర్లు దూరం డ్రిల్లింగ్ చేయాల్సి ఉందని చెప్పింది. అగర్ మిషన్ గంటకు 4-5 మీటర్ల దూరం డ్రిల్లింగ్ చేస్తుందని వివరించింది. ఆపరేషన్ పూర్తయ్యే సమయంపై మీడియా అవాస్తవాలు ప్రసారం చేయెద్దని కోరింది. గురువారం సాయంత్రం డ్రిల్లింగ్ చేసే యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అధికారులు శిథిలాలను తొలగించే పనిని నిలిపివేశారు. మరోవైపు సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా 40 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ప్రమాద ఘటనకు సమీప ప్రాంతంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.