Uttarkashi Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్ ఉత్తర్‌కాశీలో కూలిన సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం అత్యంత సవాలుగా మారింది. సొరంగాన్ని తవ్వేందుకు ఉద్దేశించిన ఆగర్ యంత్రం విరిగిపోవడం వల్ల వారు బయటకు రావడం మరింత ఆలస్యం కానుంది. ప్రత్యామ్నాయంగా భాగంగా కొండ ఎగువ భాగం నుంచి నిట్టనిలువునా కిందకు తవ్వే ప్రక్రియను రెస్క్యూ బృందాలు ప్రారంభించాయి. వర్టికల్ డ్రిల్లింగ్‌ను సట్జెజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) చేపట్టింది. సరిహద్దు రోడ్డు రవాణా సంస్థ (BRO) సాయంతో వెర్టికల్ డ్రిల్లింగ్ మిషన్‌ను కొండపైకి చేర్చి డ్రిల్లింగ్ కొనసాగిస్తున్నారు. ఇందుకోసం సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. ధ్వంసమైన ఆగర్ యంత్రాన్ని బయటకు తీయడం, నిలువునా తవ్వే పనిలో సైన్యం సాయం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పనుల పర్యవేక్షనకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.
"సొరంగంలోకి వెళ్లేందుకు గాను కొండ ఎగువభాగం నుంచి నిట్టనిలువునా తవ్వకం ప్రారంభమైంది. మొత్తంగా 86 మీటర్ల మేర కిందికి తవ్వాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 20 మీటర్ల మేర పూర్తయ్యింది. అంతా సజావుగా సాగితే 100 గంటల్లోనే కూలీల వద్దకు చేరుకుంటాం. చుట్టుపక్కల తవ్వే యంత్రాలు కూడా ఈ రాత్రికి సిల్‌క్యారా చేరుకోనున్నాయి. సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఇందులో సమాంతరంగా తవ్వుకుంటూ వెళ్లడమే ఉత్తమమైంది."
--మహమూద్ అహ్మద్, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ ఎండీ