Uttarkashi Tunnel Rescue Operation Success :'రాళ్ల నుంచి కారిన నీరు తాగాను.. అందుబాటులో ఉన్న మరమరాలు తిని ఇన్ని రోజులు బతికాను'.. గత 17 రోజులుగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఒక కూలీ అన్న మాటలివి. టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఈ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు ఝార్ఖండ్‌కు చెందిన అనిల్ బేడియా అనే కార్మికుడు. సొరంగం లోపలే తామందరం ప్రాణాలు కోల్పోతామని అనుకున్నామని.. మొదటి రెండు రోజులు తాము బతికి బయటకు వస్తామన్న ఆశలు కూడా లేవని అనిల్ వివరించారు. అయితే తమను సురక్షితంగా బయటకు చేర్చడంలో చొరవ చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు.
"ఈ ఘటనను మేమందరము ఓ పీడకలలా భావిస్తున్నాము. దాహార్తిని తీర్చుకోవడానికి సొరంగంలో ఉన్న రాళ్ల మధ్యలో నుంచి కారుతున్న నీటిని ఒడిసిపట్టుకుని తాగాము. మొదటి 10 రోజులైతే మరమరాలు తిని బతికాము. ఆ తర్వాత అధికారులు అందించిన పండ్లు, నీళ్లు సహా ఇతర ఆహార పదార్థాలతో మేము బలమైన తిండి తినగలిగాము. దాదాపు 70 గంటల తర్వాత అధికారులు మమ్మల్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమవ్వడం వల్ల మేము బతుకుతాం అనే ఆశలు మొదలైయ్యాయి."
- అనిల్ బేడియా, సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుడు
ఆనందంతో వీల్‌ఛైర్‌లోనే..
టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్లో 15 మంది ఝార్ఖండ్‌కు చెందిన వారే. క్షేమంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం తమవాళ్లు (కూలీలు) ప్రాణాలతో తిరిగి రావడం వల్ల వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న రాజేంద్ర అనే కూలీ కూడా ప్రాణాలతో బయటకు రావడం వల్ల.. పక్షవాతంతో బాధపడుతున్న అతడి 55 ఏళ్ల తండ్రి వీల్‌ఛైర్‌లోనే సంబరాలు చేసుకున్నారు.
కార్మికుల్లో ఇద్దరు ఉత్తరాఖండ్, ఐదుగురు బిహార్, ముగ్గురు బంగాల్, ఎనిమిది మంది ఉత్తర్ ప్రదేశ్, ఐదుగురు ఒడిశా, ఇద్దరు అసోం, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఇక కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకువచ్చిన నేపథ్యంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బాణాసంచా కాల్చారు. సొరంగం బయట కొందరు 'హర హర మహాదేవ్', 'భారత్ మాతా కీ జై', 'మోదీ, ధామీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులకు పూల దండలు వేసి స్వాగతం పలికారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి వీకే సింగ్.
ప్రత్యేక హెలికాఫ్టర్‌లో..
కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అనంతరం వారందరినీ ప్రత్యేక అంబులెన్స్‌లలో చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో విశ్రాంతి తీసుకున్నారు. అంతకుముందు సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరందరూ తిరిగి స్వస్థలాలకు వెళ్లే ముందు తదుపరి వైద్య చికిత్సల కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తరలిస్తామని ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ హెల్త్ నోడల్ అధికారి బీమ్లేష్ జోషీ తెలిపారు. ఇందులో భాగంగానే భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాఫ్టర్‌లో వీరిని బుధవారం మధ్యాహ్నం ఎయిమ్స్‌కు తరలించారు.
"సొరంగంలో చిక్కుకున్న నాటి నుంచి మేమంతా సురక్షితంగా బయటకు వస్తామనే ఆశ నాకుంది. అధికారులు అందించిన ఆహార పదార్థాలు తిని అందరం క్షేమంగా ఉన్నాము. మమ్మల్ని రక్షించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు"
-విశాల్, సొరంగం నుంచి బయటపడ్డ కూలీ
'అందరికీ థ్యాంక్స్..'
ఈ 17 రోజులు సొరంగం లోపల యోగా, మార్నింగ్ వాక్ కూడా చేశామని.. అందుకే ఇంత ఉత్సాహంగా ఉన్నామని టన్నెల్ నుంచి బయటకు వచ్చిన ఓ కార్మికుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో కూలీలు యోగక్షేమాలు తెలుసుకున్నారు మోదీ. వీరందరినీ ప్రాణాలతో రక్షించడంలో రాత్రింబవళ్లు కష్టపడ్డ రెస్క్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే కార్మికులు చికిత్స పొందిన తర్వాత వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్ని ఏర్పాట్లు చేస్తారని మోదీ కార్మికులతో ఫోన్లో చెప్పారు.