Uttarakhand Tunnel Update :ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్‌క్యారీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు ఆదివారం మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని పైపుల నుంచి బయటకు తీయగానే మనుషులే డ్రిల్లింగ్ చేయనున్నారు. ఇందుకు సమయం ఎక్కువ పట్టే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. సొరంగం లోపల పనిచేస్తున్న సహాయ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత కోసం గొడుగులాంటి నిర్మాణం చేపడుతున్నారు.
అలాగే లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులతో మాట్లాడేందుకు BSNL సిబ్బంది ల్యాండ్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫోన్ ద్వారా కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కల్పించనున్నారు. ఇందుకోసం చిన్నపాటి టెలిఫోన్ ఎక్సేంజ్‌ను సొరంగంలోపల BSNL ఏర్పాటు చేస్తోంది. ఈనెల 12 నుంచి లోపలే ఉన్న కార్మికుల్లో మానసిక స్థైర్యం కల్పించేందుకు వారికి కొన్ని మొబైల్ ఫోన్లు పంపినట్లు అధికారులు చెప్పారు. వాటిలో గేమ్‌లు ఆడుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు. మొబైల్ టవర్ సిగ్నల్స్ లేనందున.. వైఫై ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు.
సొరంగంలో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. ఘటనాస్థలిలో జరుగుతున్న సహాయక చర్యల పురోగతి గురించి ప్రధాని మోదీ ప్రతీరోజూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. కూలీలందర్ని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ధామీ పేర్కొన్నారు.