Uttarakhand Tunnel Update :ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు బయటకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న ఆగర్ యంత్రం ధ్వంసమైంది. ఆగర్ యంత్రం ఇక సహాయక ( Uttarakhand Tunnel Rescue Operation) చర్యలకు పనికిరాదని నిపుణులు స్పష్టం చేశారు. అది రిపేర్ చేయలేని స్థాయిలో ధ్వంసమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటి? కూలీలను బయటకు తీసుకురావడానికి ఉన్న మార్గాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ప్రస్తుతం సహాయక చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి?
అమెరికా నుంచి తెప్పించిన ( Tunnel Rescue Uttarakhand ) ఆగర్ యంత్రంతో శిథిలాలకు సమాంతరంగా డ్రిల్లింగ్ చేశారు. అయితే, ఆగర్ యంత్రం ఇప్పుడు పనిచేయడం లేదు. సొరంగంలో ఆగర్ యంత్రం బ్లేడ్లు విరిగిపోయాయి. శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లను తీయడానికి ప్లాస్మా కటర్ అవసరమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. దాన్ని హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
ఆగర్ యంత్రం ఎందుకు ఆగిపోయింది?
ఆగర్ యంత్రం చాలా వరకు సమర్థంగా పని చేసినప్పటికీ.. శిథిలాల్లో కొన్నిచోట్ల దానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నాలుగుసార్లు ఆగర్ యంత్రం ఆగిపోయిందని అంతర్జాతీయ సొరంగ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. "ఈ కొండప్రాంతం చాలా కఠిన సవాళ్లు విసురుతోంది. ఆగర్ యంత్రం నాలుగు సార్లు దెబ్బతింది. ఇక ఆగర్ పని చేయదు. అది ధ్వంసమైంది. దాన్ని సహాయక చర్యలకు వినియోగించడం కుదరదు. రిపేర్ చేయలేని రీతిలో అది పాడైంది. కొత్త ఆగర్‌ను రంగంలోకి దించే ప్రస్తావనే లేదు" అని డిక్స్ వివరించారు.
కూలీలను తీసేందుకు ఇప్పుడు ఏం చేస్తారు?
ఆగర్ యంత్రం విఫలమైన నేపథ్యంలో మ్యాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యామ్నాయాల మార్గాలనూ అన్వేషిస్తున్నారు. సొరంగంపై నుంచి నిలువునా డ్రిల్లింగ్ చేపట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు వర్టికల్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కొండపైకి చేర్చాలని సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ఓ) అధికారులు తమ సిబ్బందిని ఆదేశించారు.
సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్(ఎస్‌జేవీఎన్) బృందం కూడా వర్టికల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం భారీ యంత్రాలు, బోరింగ్ మెషీన్‌ను అమెరికా, ముంబయి, గాజియాబాద్ నుంచి ఓఎన్జీసీ తెప్పించింది. 'మా టీమ్ ఆ ప్రాంతంలో సర్వే పూర్తి చేసింది. 5, 6 రోజుల్లో వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి చేస్తామని ప్రతిపాదనలు పంపించాం. తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం' అని సట్లెజ్ జల్ విద్యుద్ నిగమ్ వెల్లడించింది.