తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానసిక వైద్యులతో కూలీలకు కౌన్సిలింగ్​- రోబోలతో పర్యవేక్షణ! కుటుంబాల కోసం క్యాంపులు - uttarkashi tunnel collapse latest news

Uttarakhand Tunnel Rescue Update : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. మానసిక వైద్యులతో కౌన్సిలింగ్​తో పాటు రోబోలను కూడా రంగంలోకి దింపారు.

Uttarakhand Tunnel Rescue Update
Uttarakhand Tunnel Rescue Update

By PTI

Published : Nov 27, 2023, 8:18 PM IST

Uttarakhand Tunnel Rescue Update : చుట్టూ చీకటి.. సుమారు 15 రోజులుగా సొరంగంలోనే జీవనం.. ఏం జరుగుతుందో తెలియని అయోమయం.. ఎప్పుడు బయటకు వస్తామో తెలియని భయంతో కాలం వెల్లదీస్తున్నారు ఉత్తరాఖండ్​లోని కూలిన సొరంగంలో చిక్కుకున్న కార్మికులు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నా.. వారి స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు.

ఒకవైపు కుటుంబసభ్యులతో మాట్లాడిస్తూనే.. మరోవైపు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మానసిక వైద్యులతో కూడిన డాక్టర్ల బృందం రోజుకు రెండుసార్లు ప్రమాద స్థలానికి వచ్చి కార్మికులతో మాట్లాడి ధైర్యాన్ని నింపుతున్నారు. ఉదయం 9 నుంచి 11 వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కార్మికులకు కౌన్సిలింగ్​ ఇస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు ఉండేందుకు వీలుగా క్యాంప్​ను సిద్ధం చేశారు అధికారులు. కార్మికులతో ఏ సమయంలోనైనా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.

"మేము అతడికి ధైర్యాన్ని చెబుతున్నాం. ఇక్కడ సహాయక చర్యలకు ఎదురవుతున్న అడ్డంకుల గురించి చెప్పడంలేదు. మీరంతా త్వరలోనే బయటకు వస్తారని నమ్మకాన్ని కల్పిస్తున్నాం. ప్రస్తుతం కార్మికులంతా బాగున్నారు. వారికి కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువు లోపల ఉంది."

--నైయ్యర్​, సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు సోదరుడు

రంగంలోకి రోబోలు
మరోవైపు కార్మికుల్లో మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు రోబోలను సైతం రంగంలోకి దింపారు. ఇందుకోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ రోబోలు కార్మికుల మానసిక స్థితితో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తాయని రోబోటిక్​ నిపుణులు మిలింద్​ రాజ్​ తెలిపారు.

"ఈ రోబోలు.. కార్మికుల ఆరోగ్యం పర్యవేక్షణతో పాటు ఇంటర్నెట్​ సేవలను అందిస్తాయి. దీంతో పాటు సొరంగంలో మీథేన్​ లాంటి హానికర వాయువులను ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాయి. సుమారు 100 మీటర్ల వరకు ఈ రోబోలు పనిచేస్తాయి. ఇంతకుముందు లఖ్​నవూలో భవనం కూలి 14 మంది చిక్కుకున్న ప్రమాదంలో వారందరిని కాపాడాం. అదే రోబోటిక్ వ్యవస్థను ఇప్పుడు వినియోగిస్తున్నాం. వీలైనంత త్వరగా రోబో వ్యవస్థను సిద్ధం చేసి పనులను ప్రారంభిస్తాం."

--మిలింద్​ రాజ్​, రోబోటిక్ నిపుణుడు

డాక్టర్లతో కౌన్సిలింగ్​
మరోవైపు ఇద్దరు మానసిక వైద్యులు సహా ఐదుగురు డాక్టర్లు సొరంగం వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వైద్యాధికారి డాక్టర్​ బిమ్లేశ్​ జోషి తెలిపారు. వీరే కాకుండా మరో 10 మంది వైద్యులు రెస్క్యూ ఆపరేషన్​ జరగుతున్నంత సేపు అక్కడే ఉంటారని చెప్పారు. కార్మికుల కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి కూడా కౌన్సిలింగ్​ ఇస్తున్నామన్నారు.

"మొదట్లో ఎనర్జీ డ్రింక్స్​, జ్యూసులు ఇచ్చాం. కానీ ఇప్పుడు పూర్తి భోజనాన్ని అందిస్తున్నాం. ఉదయం పాలు, టీ, ఉడుకబెట్టిన గుడ్లు.. మధ్యాహ్నం, రాత్రికి పప్పు, అన్నం, చపాతీ, ప్లేట్లు పంపిస్తున్నాం. నీరసం కాకుండా ఉండేందుకు ఓఆర్​ఎస్​ తాగమని చెబుతున్నాం. కంటి చుక్కలు, విటమిన్​ మాత్రలు, డ్రై ఫూట్స్​, బిస్కెట్స్​ కూడా పంపిస్తున్నాం. టూత్​పేస్ట్, బ్రష్​, టవల్స్, బట్టలు కూడా పంపించాం. సినిమాలు, వీడియో గేమ్స్​తో కూడిన స్మార్ట్​ ఫోన్లను సొరంగంలోకి పంపించాం. పడుకోవడానికి షీట్లు ఉన్నాయి. సొరంగంలో సుమారు రెండు కిలోమీటర్ల స్థలం ఉంది. ఉదయం, సాయంత్రం కార్మికులు యోగా, వాకింగ్​ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం లోపల సుమారు 24 డిగ్రీల సెల్సియస్​ ఉండడం వల్ల స్వెట్టర్లు అవసరం లేదు. సొరంగంలో ముందుగా ఉన్న విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకపోవడం వల్ల లోపల 24 గంటలు కరెంట్​ ఉంటుంది."

--ప్రేమ్​ పోక్రియాల్​, వైద్యుడు

నిలువుగా 32 మీటర్లు డ్రిల్లింగ్​ పూర్తి
మరోవైపు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్‌ పనులను పక్కనబెట్టేసిన సహాయక బృందాలు.. కొండపైనుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులను చేపట్టారు. ఇప్పటి వరకు డ్రిల్లింగ్​ 32 మీటర్లకు చేరుకుందని.. మరో నాలుగు రోజుల్లో పనుల పూర్తయి కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారత సైన్యంలో ఇంజినీర్స్‌ కోర్‌కు చెందిన మద్రాస్‌ సాపర్స్‌ సహకారంతో కొండపై నుంచి నిలువుగా డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. కొండలో దిగువకు వెళ్తున్న కొద్దీ.. ఏయే పొరల్లో కూర్పు ఎలా ఉందో తెలుసుకునే పరీక్షలు ముందుగా మొదలుపెట్టారు. నిలువుగా చేస్తున్న డ్రిల్లింగ్‌.. 31 మీటర్ల వరకు చేరుకుందని ఆర్మీ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఆయన.. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఈ డ్రిల్లింగ్‌ చేసిన దారిలో వేసేందుకు 800 మిల్లీమీటర్ల పైపులు సిద్ధం చేశామని.. అన్నీ సవ్యంగా జరిగితే 24 నుంచి 36 గంటల్లో ఒక స్పష్టత వస్తుందని హర్పాల్‌ సింగ్‌ వెల్లడించారు.

వీలైనంత త్వరగా సమాంతర డ్రిల్లింగ్​ ప్రారంభం
విరిగిపోయిన డ్రిల్లింగ్‌ యంత్ర భాగాలను.. హైదరాబాద్‌ నుంచి రప్పించిన ప్లాస్మా కట్టర్‌తో తొలగించామని జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా సమాంతరంగా డ్రిల్లింగ్​ను కూడా చేపడతామని చెప్పారు. సిబ్బందికి ప్రమాదం జరగకుండా గొడుగులాంటి నిర్మాణం చేపడుతున్నారు. స్టీలు గొట్టం నుంచి వెళ్లి ఒకరు తవ్వుతుంటే మరొకరు ఆ వ్యర్థాలను బయటకు చేరవేయాలి. 180 మీటర్ల మేర ప్రత్యామ్నాయ సొరంగాన్ని తవ్వే పనిని మంగళవారం ప్రారంభించే అవకాశం ఉంది. అది 12-14 రోజుల్లో పూర్తవుతుంది. బార్కోట్‌ వైపు నుంచి కూలీలను చేరుకోవాలంటే 483 మీటర్లు తవ్వాలి. ఇది 40 రోజులు తీసుకుంటుంది. ఇప్పటివరకు 10 మీటర్లు పూర్తయింది. కార్మికులను వెలికితీసే రెండు పనుల్లో ఏది త్వరగా పూర్తవుతుందన్న దానిపై హర్పాల్‌ సింగ్‌ స్పష్టత ఇచ్చారు. అడ్డంకులు ఎదురవ్వడాన్ని బట్టి అది ఉంటుందని వెల్లడించారు.

సురక్షితంగా బయటకు రావాలని పూజలు
ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. గని లోపల చిక్కుకున్న కార్మికులతోనూ మిశ్రా మాట్లాడారు. వీలైనంత త్వరగా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details