Uttarakhand Tunnel Rescue Update :ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 55.3 మీటర్ల మేర డ్రిల్లింగ్ పనులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వేసిన పైపునకు మరొక పైపును వెల్డింగ్ చేసి లోపలకు పంపాల్సి ఉందని తెలిపారు. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా కూలీలు సురక్షితంగా సొరంగంలో నుంచి బయటపడవచ్చని అన్నారు.
సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసేందుకు 17 రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వంటి సునిశితులైన సహాయక బృందాలే కాక.. అమెరికా నుంచి మైనింగ్ ఆపరేషన్లలో అపార అనుభవం ఉన్న సిబ్బందినీ రంగంలోకి దించారు. అయితే ప్రతీసారి ఏదో ఒక అవరోధం ఏర్పడి కార్మికులను బయటకు తీసే చర్యలు ఆలస్యం అవుతున్నాయి. హారిజెంటల్ డ్రిల్లింగ్ చేసే 25 టన్నుల అమెరికన్ ఆగర్ యంత్రంపై కోటి ఆశలు పెట్టుకోగా.. దాని బ్లేడ్‌లు సైతం విరిగి నేలలోనే చిక్కుకున్నాయి. దీంతో సోమవారం నుంచి ర్యాట్ హోల్ మైనింగ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.
మాన్యువల్ డ్రిల్లింగ్‌లో భాగంగా చేపట్టిన ఈ పద్దతి రెస్క్యూ చర్యల్లో శీఘ్ర పురోగతినే సాధించింది. 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులకు ప్రస్తుతం ఈ ర్యాట్ హోల్ డిగ్గర్‌లు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారు. చిన్న యంత్రాలు, చేతి పరికరాలతోనే ఈ ర్యాట్‌హోల్ మైనింగ్ చేస్తారు. గరిష్ఠంగా 4 అడుగులు ఉండే చిన్న సొరంగాల్లో బొగ్గును తవ్వి వెలికితీసే పద్ధతి ఇది. అలా బొరియలు చేస్తూ లోపలికి వెళ్లి.. శిథిలాలను బొగ్గును బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ప్రక్రియే సిల్క్‌యరా సొరంగంలో కొనసాగుతోంది.
What Is Rathole Drilling :మేఘాలయలో నాణ్యతగల బొగ్గు ఉండదు. దీంతో ప్రొఫెషనల్‌గా అక్కడ మైనింగ్ చేయరు. దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడి స్థానికులు అక్రమంగా బొగ్గును ర్యాట్‌హోల్ మైనింగ్ ద్వారా బయటకు తీస్తారు. వర్షాకాలంలో బొరియల్లో నీరు చేరడం వల్ల స్థానికులు వాటిలో చిక్కుకుని చనిపోయిన ఘటనలు చాలా జరిగాయి. ఈ మైనింగ్‌లో చిన్నపిల్లల వినియోగం, పర్యావరణ కాలుష్యం ఎక్కువ ఉండటం వల్ల 2014లో దీనిపై నిషేధం పడింది. ఇది అశాస్త్రీయ విధానమనీ.. సురక్షితం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై నిషేధం విధించింది. అగార్ యంత్రం దెబ్బతినడం.. వర్టికల్ డ్రిల్లింగ్ ఆలస్యం అవడం వల్ల మాన్యువల్‌గా ప్రస్తుతం ర్యాట్‌హోల్ పద్ధతి కొనసాగుతోంది.