Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు శుక్రవారం లేదా శనివారంలోగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. కార్మికులను చేరుకునే చివరి 12 మీటర్ల గొట్టపు మార్గపు పనిలో అవాంతరాలు ఏర్పడటం వల్ల ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆగర్ యంత్రంలో మూడు సార్లు సమస్యలు తలెత్తడం వల్ల గురువారం పూర్తి కావాల్సిన పని ఆలస్యమైనట్లు చెప్పారు.
Uttarkashi Tunnel Rescue Update :మరోవైపు డ్రిల్లింగ్ పనుల కోసం రప్పించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల్ని చేరుకునేందుకు వర్టికల్ డ్రిల్లింగ్‌ను సైతం చేయాలా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ గురువారం రాత్రంతా టన్నెల్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చే పనుల దృష్ట్యా ఉత్తరాఖండ్‌లో జరుపుకొనే "ఇగాస్" పండగకు సీఎం దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.