Uttarakhand Tunnel Rescue Operation :ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో ఇప్పటివరకు 36 మీటర్లు పూర్తయింది. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.20 మీటర్ల వెడల్పైన గొట్టాలను వీటి ద్వారా ప్రవేశపెడుతున్నారు. మరోపక్క బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులైన ర్యాట్ హోల్ మైనర్లు సొరంగ మార్గం వద్దకు చేరుకున్నారు. ఆగర్ యంత్రం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను వీరు చేపట్టనున్నారు. శిథిలాల గుండా పంపించిన 800 మిల్లీ మీటర్ల వ్యాసార్థం గల పైపులోనికి ర్యాట్ హోల్ మైనర్లు వెళ్లి డ్రిల్లింగ్ పనులు చేపట్టనున్నారు. 800 మిల్లీ మీటర్ల పైపులోకి ముగ్గురు ర్యాట్ హోల్ మైనర్లు వెళతారని రాకేశ్ రాజ్‌పుత్ అనే నిపుణుడు చెప్పారు. వారిలో ఒకరు డ్రిల్లింగ్ పనులు, మరొకరు శిథిలాలను సేకరించడం చేస్తారని వివరించారు. మరొ వ్యక్తి శిథిలాలను ట్రాలీలో బయటకు చేరవేస్తాడని వెల్లడించారు. ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి ద్వారా 24 గంటల్లో 10 మీటర్ల మేర శిథిలాలను తొలగించవచ్చని మరో నిపుణుడు పేర్కొన్నారు.
కూలీలతో మాట్లాడిన అధికారులు..
ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.సంధు సోమవారం సిల్‌క్యారాకు చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మిశ్రతో గబ్బర్‌సింగ్ అనే కూలీ మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు అనేక సంస్థలు రంగంలో దిగినందున కాస్త ఓర్పుతో ఉండాలని కార్మికులకు మిశ్ర సూచించారు.
'సొరంగ నిర్మాణ పనితో మాకు సంబంధం లేదు'
సొరంగం నిర్మాణ పనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమకెలాంటి సంబంధం లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. నిర్మాణ కంపెనీలో తమకు, అనుబంధ సంస్థలకు ఎలాంటి వాటా లేదని అదానీ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.