Uttarakhand Tunnel Rescue Operation :17రోజుల తర్వాత సొరంగం నుంచి బయటపడిన కార్మికుల ధైర్యం గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేవుని ఆశీస్సులు, బాధితుల కుటుంబసభ్యులు చేసుకున్న పుణ్యం వల్లే.. వారంతా క్షేమంగా సొరంగం నుంచి బయటపడ్డారని అన్నారు. ఉత్తరకాశీలోని సొరంగం నుంచి బయటపడిన బాధితులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఎన్నోకష్టాల తర్వాత కార్మికులంతా సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తాము సురక్షితంగా బయటపడటానికి కారణమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, సీఎం పుష్కర్ సింగ్ ధామీకి బాధిత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
"ఎంతోకష్టం తర్వాత కూడా మీరు బయటపడ్డారు. నాకైతే చాలా సంతోషకరమైన విషయం. మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఏదైనా ఘోరం జరిగి ఉంటే మనసును అదుపు చేసుకోవటం చాలా కష్టమయ్యేది. కేదార్‌నాథ్ బాబా, బద్రీనాథ్ భగవాన్ ఆశీస్సులతో మీరంతా బయటపడ్డారు. 16, 17రోజులు తక్కువ సమయం కాదు. మీరంతా చాలా ధైర్యంతో ఉన్నారు. ఒకరు ఇంకొకరికి ధైర్యం చెప్పటం అన్నింటి కంటే పెద్దమాట. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో రైలు డబ్బాల్లోనూ కలిసి ప్రయాణిస్తుంటే కూడా ఒక్కోసారి భయమేస్తుంది. అయినప్పటికీ మీరంతా ఎంతో ధైర్యంతో ఉన్నారు. నేను నిరంతరం సమాచారం తెలుసుకునేవాణ్ని. సీఎంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడేవాణ్ని. పీఎంవో అధికారులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. సమాచారం తెలిసినప్పటికీ మనసులో ఆందోళన మాత్రం అలాగే ఉండేది. ఎంతమంది అయితే బయటపడ్డారో అందరికీ.. వారి కుటుంబ సభ్యుల పుణ్యం కూడా పనిచేసింది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అంతకుముందు అలుపెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని, క్షేమ సమాచారం కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబసభ్యుల్ని చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనాస్థలిలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ, కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఇతర ఉన్నతాధికారులు కూలీలకు పూలమాలలు వేసి, భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు.