Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు మాన్యువల్ డ్రిల్లింగ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శిథిలాల ద్వారా ఆగర్ మెషీన్‌తో చేస్తున్న డ్రిల్లింగ్‌కు మళ్లీ మళ్లీ అవాంతరాలు ఎదురువుతున్నందున మాన్యువల్ డ్రిల్లింగ్ చేయాలని భావిస్తున్నారు. 13రోజులుగా సిల్‌క్యారా సొరంగంలో కూలీలు చిక్కుకుని పోయి ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేస్తుండగా శుక్రవారం రాత్రి మళ్లీ ఏదో అడ్డుపడి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆగర్ మెషీన్‌ను పక్కనపెట్టి మనుషులతో.. డ్రిల్లింగ్ చేసే ఆలోచన చేస్తున్నారు. అయితే మాన్యువల్ డ్రిల్లింగ్‌కు సమయం ఎక్కువపడుతుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో.. చర్చలు జరుపుతున్నారు. ఆగర్ మిషన్‌ను బయటకు తీసిన తర్వాతే.. మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టే అవకాశముందని ఒక అధికారి తెలిపారు.
'గొట్టంలో శ్వాసపరమైన ఇబ్బందులు లేవు'
Uttarakhand Tunnel Update :మరోవైపు కార్మికులను పైపు ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు విజయవంతంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా 800MM వెడల్పు ఉన్న పైపు గుండా చక్రాలు ఉన్న స్ట్రెచర్‌పై ఓ వ్యక్తిని ఉంచి లోపలికి పంపారు. అటుపై దానికి కట్టిన తాడు సహాయంతో బయటకు లాగారు. ఈ ప్రక్రియ విజయవంతంగా సాగింది. పైపు లోపలికి వెళ్లి మళ్లీ బయటకు వచ్చిన ఆ వ్యక్తి పైపులో తగినంత స్థలం ఉందని, శ్వాసపరమైన ఇబ్బందులేమి ఎదురవ్వలేదని తెలిపారు.
కార్మికుల కుటుంబ సభ్యులు
సొరంగంలో చిక్కుకున్న ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్ చేరుకున్నారని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఇప్పటికే ఉత్తరకాశీలో ఉన్నారని వారికి ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులతో వారి కుటుంబ సభ్యులు వాకీటాకీ సెట్ల ద్వారా మాట్లాడారని అన్నారు.