కూలిన 'చార్‌ధామ్' సొరంగం- శిథిలాల కింద 40 మంది కూలీలు! - ఉత్తరాఖండ్ తాజా వార్తలు
उत्तरकाशी में बड़ा हादसा सामने आया है. जहां यमुनोत्री राष्ट्रीय राजमार्ग पर सिलक्यारा से डंडाल गांव तक निर्माणाधीन सुरंग के अंदर भूस्खलन होने से मजदूरों फंस गए .
Published : Nov 12, 2023, 1:18 PM IST
|Updated : Nov 12, 2023, 8:07 PM IST
12:54 November 12
కూలిన చార్‌ధామ్ సొరంగం
Uttarakhand Tunnel Collapse :ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం పాక్షికంగా కూలిపోయింది. ఉత్తరకాశి జిల్లాలోని బ్రహ్మకల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్‌యారా, దండలగావ్ మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్‌లో కొంతమేర కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో లోపల 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు వెల్లడించారు అధికారులు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో.. 150 మీటర్ల పొడవున కూలినట్లు వివరించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల విభాగం సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు. చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది.
'యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు'
"సిల్క్‌యారా టన్నెల్‌లో ప్రారంభంలో 200 మీటర్ల మేర మార్గం దెబ్బతింది. ఈ సొరంగ నిర్మాణాన్ని పనులను హెచ్‌ఐడీసీఎల్ చూసుకుంటోంది. సొరంగం లోపల 36 మంది వరకు కార్మికులు చిక్కుకుపోయారు. ఘటనా స్థలిలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వీలైనంత త్వరగా క్షతగాత్రులను బయటకు తీసుకువస్తాము. ఈ ఘటన ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. సొరంగంలోకి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాము. తద్వారా లోపల ఉన్నవారికి శ్వాస అందుతుంది. అలాగే ఆహారాన్ని కూడా అందిస్తున్నాము" అని ఉత్తరకాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ చెప్పారు. కూలీలను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. సొరంగం పాక్షికంగా కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ఓ అధికారి వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.