తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సేఫ్​గా 41 మంది కూలీలు బయటకు- 17 రోజుల రెస్క్యూ ఆపరేషన్​ సాగిందిలా!

Uttarakhand Tunnel Collapse Timeline : సుమారు 17 రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన కార్మికులు.. మృత్యుంజయులుగా బయటపడ్డారు. సమాంతర డ్రిల్లింగ్ పూర్తి కావడం వల్ల.. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు అధికారులు. ఈ 17 రోజుల పాటు సాగిన సహాయక చర్యల తీరును ఓ సారి చూద్దాం..

Uttarakhand Tunnel Timeline
Uttarakhand Tunnel Timeline

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 8:55 PM IST

Uttarakhand Tunnel Collapse Timeline :ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. సొరంగానికి సమాంతరంగా మాన్యువల్‌ తవ్వకాలను పూర్తి చేసిన అధికారులు.. ఒక్కొక్కరిని బయటకు తీసుకు వచ్చారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన కూలీలను అధికారులు వెంటనే అంబులెన్స్​లలో ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సిల్‌క్యారాకు 30 కిలోమీటర్ల దూరంలో 41 పడకలతో తాత్కాలిక వార్డ్‌ను సిద్ధం చేశారు. దాదాపు 17 రోజుల పాటు సొరంగంలోనే గడిపిన కార్మికులకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి వీకే సింగ్​ స్వాగతం పలికారు. సొరంగం వద్ద స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 17 రోజుల పాటు సాగిన సహాయక చర్యల తీరును ఓ సారి చూద్దాం..

నవంబర్​ 12
బ్రహ్మకాల్​-యమునోత్రి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిల్​క్యారా ప్రాంతంలో చేపట్టిన సొరంగం నిర్మాణం కూలి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీపావళి రోజునే.. సాయంత్రం 5.30 సమయంలో సొరంగం పాక్షికంగా కూలడం వల్ల లోపలే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. కూలీలకు ఆహారంతో పాటు ఆక్సిజన్​, విద్యుత్​ను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత NDRF, SDRF, BRO, ITBP సహా తదితర సంస్థలతో రెస్క్యూ ఆపరేషన్​ ప్రారంభించింది.

నవంబర్​ 13
సొరంగంలోకి ఓ పైపును డ్రిల్లింగ్ చేసి లోపల చిక్కుకున్న కార్మికులతో సంబంధాన్ని నెలకొల్పారు అధికారులు. ఈ పైపు ద్వారానే ఆక్సిజన్​ను పంపించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ ధామి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొదట 30 మీటర్ల మేర కూలిన సొరంగం శిథిలాలు.. సుమారు 30 మీటర్ల మేర మరోసారి కూలి సహాయక చర్యలకు ఆటంకాన్ని కలిగించింది.

నవంబర్​ 14
అమెరికా నుంచి తెప్పించిన ఆగర్​ యంత్రంతో డ్రిల్లింగ్ చేసేందుకు వీలుగా 800, 900 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన రెండు స్టీలు పైపులను శిథిలాల్లోకి చొప్పించారు. మరోవైపు లోపల మరోసారి శిథిలాలు కూలడం వల్ల ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. సహాయక చర్యల్లో పురోగతి సాధించిన అధికారులు.. కార్మికులకు ఆహారం, నీరు, విద్యుత్​తో పాటు మందులను అందించారు.

నవంబర్​ 15
మొదట తెప్పించిన ఆగర్​ యంత్రం పనితీరుతో సంతృప్తి చెందని అధికారులు మరో మెషీన్​ను రప్పించారు. దీనిని దిల్లీ నుంచి హెలికాప్టర్ సాయంతో తీసుకువచ్చారు.

నవంబర్​ 16
దిల్లీ నుంచి తీసుకువచ్చిన యంత్రాన్ని సిద్ధం చేసి అర్ధరాత్రి నుంచి డ్రిల్లింగ్ పనులను చేపట్టారు.

నవంబర్​ 17
అర్ధరాత్రి డ్రిల్లింగ్​ పనులను చేపట్టిన అధికారులు.. 57 మీటర్ల వైశాల్యం గల పైపు చొప్పించి సుమారు 24 మీటర్ల మేర పూర్తి చేశారు. దాదాపు నాలుగు పైపులను పంపించిన తర్వాత ఐదో పైపు పంపిస్తున్న తరుణంలో మరో ఆటంకం ఎదురైంది. సాయంత్రం పనులు చేస్తున్న సమయంలో భారీ శబ్ధం రావడం వల్ల అప్రమత్తమైన అధికారులు.. సహాయక చర్యలను నిలిపివేశారు.

నవంబర్​ 18
సుమారు 1,750 హార్స్​ పవర్​ సామర్థ్యం కలిగిన యంత్రంతో పనులు చేయడం వల్ల సొరంగంలో పగుళ్లు ఏర్పడుతున్నాయని నిర్ధరించారు. ఇలానే కొనసాగితే మరిన్ని శిథిలాలు కూలి కార్మికుల ప్రాణాలకు ఇబ్బంది తలెత్తుందని పనులను నిలిపివేశారు. ప్రమాద స్థలానికి చేరుకుని ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, నిపుణులు కలిసి వర్టికల్​ డ్రిల్లింగ్​ సహా ఐదు ప్రత్యామ్నాయ మార్గాలను నిర్ణయించారు.

నవంబర్​ 19
సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలను కేంద్ర రవాణా మంత్రి నితిన్​ గడ్కరీ సమీక్షించారు. సొరంగానికి సమాంతరంగా ఆగర్​ యంత్రంతో పనులను చేపట్టాలని సూచించారు.

నవంబర్​ 20
ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్​లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొనసాగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద పరిమాణం గల ఆహార పదార్థాలు పంపించేందుకు వీలుగా 6 ఇంచుల పైపును పంపించారు. సమాంతర డ్రిల్లింగ్​ పనులను ఇంకా తిరిగి మొదలుపెట్టలేదు.

నవంబర్​ 21
కూలీలకు సంబంధించి తొలిసారిగా వీడియోను విడుదల చేశారు అధికారులు. పసుపు, తెలుపు రంగు హెల్మెట్లు ధరించి ఉన్న కార్మికులు అందులో కనిపించారు. పైపులైన్​ ద్వారా వచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ప్రత్యామ్నాయంగా బార్కోట్‌ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను చేపట్టాలని అనుకున్నారు. అయితే, కూలీలను చేరుకోవాలంటే 483 మీటర్లు తవ్వాలి. ఇది 40 రోజులు తీసుకుంటుందని నిపుణులు చెప్పారు. అనంతరం నిలిపివేసిన సమాంతర డ్రిల్లింగ్​ పనులను తిరిగి చేపట్టారు.

నవంబర్​ 22
మరోవైపు కూలీలకు అత్యవసర చికిత్స కోసం సమీపంలోని హెల్త్ సెంటర్​లో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. సొరంగం సమీపంలో అంబులెన్స్​లను ఉంచారు. 800 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన పైపులను ఉపయోగించి ఆగర్ యంత్రంతో సమాంతర డ్రిల్లింగ్​ను చేపట్టి.. సుమారు 45 మీటర్లు తొలగించారు. సుమారు మరో 12 మీటర్లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఆగర్​ యంత్రానికి ఇనుప రాడ్లు తగలడం వల్ల పనులు నిలిచిపోయాయి.

నవంబర్​ 23
ఐరన్​ రాడ్లు తగలడం వల్ల సుమారు 6 గంటల పాటు సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఉదయం రాడ్లను తొలగించి పనులను తిరిగి ప్రారంభించారు. సుమారు 1.8 మీటర్లు డ్రిల్లింగ్ చేశాక.. పగుళ్లు రావడం వల్ల పనులను తిరిగి నిలిపివేశారు.

నవంబర్​ 24
పగుళ్లు రావడం వల్ల నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించారు. అయితే, ప్రారంభించిన గంటకే.. మరో ఇనుప మెష్​ అడ్డుతగలడం వల్ల తిరిగి పనులను నిలిపివేశారు. ఆగర్ యంత్రం భాగాలు ధ్వంసమయ్యాయని నిర్ధరించారు.

నవంబర్​ 25
ఆగర్​ యంత్ర భాగాలు లోపలే ఇరుక్కుపోవడం వల్ల సమాంతరం డ్రిల్లింగ్​కు ఆటంకంగా మారింది. ఈక్రమంలోనే అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్​ను రప్పించారు. కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు వర్టికల్ డ్రిల్లింగ్‌ను సైతం చేయాలా లేదా అనేది పరిశీలించారు.

నవంబర్ ​26
సమాంతర డ్రిల్లింగ్​కు అడ్డంకులు రావడం వల్ల కొండపై నుంచి నిలువుగా డ్రిల్లింగ్​ను చేపట్టారు. ఇలా 86 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే సొరంగంలోకి చేరుకుంటారు. BRO అధికారుల సహాయంతో చేపట్టిన ఈ ఆపరేషన్​లో సుమారు 20 మీటర్ల దూరం చేరుకున్నారు. మరోవైపు లోపల ఇరుక్కున్న యంత్రం భాగాలను తొలగించేందుకు హైదరాబాద్​ నుంచి తెప్పించి ప్లాస్మా కట్టర్​ను రప్పించారు.

నవంబర్ 27
ప్లాస్మా కట్టర్​తో లోపల ఇరుక్కున్న ఆగర్ యంత్ర భాగాలను తొలగించారు. మిగిలి ఉన్న సుమారు 12 మీటర్ల శిథిలాలను తొలగించేందుకు మ్యానువల్​ డ్రిల్లింగ్​ను చేపట్టారు. ర్యాట్​ హోల్​ మైనింగ్​ నిపుణులను రప్పించి డ్రిల్లింగ్​ను మొదలుపెట్టారు.

నవంబర్​ 28
సమాంతర డ్రిల్లింగ్​లో చివరగా మిగిలిన భాగాన్ని​ పూర్తి చేసిన అధికారులు.. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. NDRF, SDRF సిబ్బంది స్టీల్​షూట్​తో లోపలికి వెళ్లి.. చక్రాల స్ట్రెచర్​పై ఒక్కొక్కరిని బయటకు తీసుకువచ్చారు.

డ్రిల్లింగ్ పనులు పూర్తి- ఏ క్షణంలోనైనా సేఫ్​గా బయటకు రానున్న కూలీలు!

రెస్క్యూ ఆపరేషన్ మరింత ముమ్మరం- రంగంలోకి రోబోలు! ఓర్పుతో ఉండాలని కార్మికులకు విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details