Uttarakhand Tunnel Collapse Rescue: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొన్ని గంటల్లో బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 45 మీటర్ల మేర శిథిలాల ద్వారా సమాంతరంగా ప్రవేశపెట్టారు. గతరాత్రి స్టీల్ మెష్ పైపునకు అడ్డుపడడంతో పైపులైన్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ నిలిచిపోయింది. మెషన్‌ను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి.. ఉదయానికి పూర్తిగా తొలిగించారు. ఇప్పుడు ఆఖరి పైపును శిథిలాల ద్వారా కార్మికులు ఉన్న చోటకు చేర్చే ప్రయత్నం చివరి దశకు చేరుకుంది.
డ్రిల్లింగ్ పూర్తై.. పైపులైన్ కార్మికుల వద్దకు చేరగానే.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఫ్ బృందం సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు వారు ముందే కసరత్తులు పూర్తిచేశారు. స్ట్రెచర్లు, ఆక్సిజన్ కిట్లు తీసుకుని కార్మికుల వద్దకు చేరుకునేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకరి తర్వాత ఒకరిని బయటకు చేర్చేలా ప్రణాళికలను రచించారు. బయటకు వచ్చిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు వైద్యసామగ్రితో కూడిన బృందం ఘటనాస్థలానికి బయటే ఉంది. వారి కోసం 41 బెడ్లతో కూడిన ప్రత్యేక ఆస్పత్రిని అధికారులు సిద్ధం చేశారు.
'12 నుంచి 14 గంటలు పట్టొచ్చు'
Uttarakhand tunnel collapse latest news : దిల్లీ, రూర్కీ నుంచి టన్నెల్ నిపుణులు, వెల్డింగ్ నిపుణులను రప్పించారు. మరో ఆరు మీటర్లు పైపులైన్‌ను చేర్చగలిగితే.. కార్మికులను చేరుకోవచ్చని పీఎంఓ మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇందుకు 12 నుంచి 14 గంటల సమయం పట్టొచ్చని ఖుల్బే అభిప్రాయపడ్డారు. తర్వాత కార్మికులను బయటకు తేవడానికి మరో 3 గంటలు పట్టొచ్చని చెప్పారు. ఇక మరే అవాంతరాలు ఎదురుకాకపోవచ్చని ఆయన అన్నారు. కార్మికులను బయటకు తీసుకురాగానే.. వారిని ఆసుపత్రికి చేర్చేలా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఉత్తరకాశీ ఎస్పీ యధువంశీ చెప్పారు. కార్మికులను చిన్యాలిసౌర్‌కు తరలించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రిషికేష్ తీసుకెళతారని ఎస్పీ వివరించారు.