Uttarakhand Tunnel Collapse Rescue :ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో 11 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయ బృందాలు మరింత దగ్గరయ్యాయి. సిల్‌క్యారా వద్ద అమెరికన్ ఆగర్ యంత్రంతో మంగళవారం రాత్రి నుంచి పునఃప్రారంభమైన డ్రిల్లింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. కూలీలకు, సహాయ బృందాలకు మధ్యలో కొండలా ఉన్న శిథిలాలను ఆగర్ యంత్రంతో సమాంతర డ్రిల్లింగ్ చేస్తున్నారు. 800MM వ్యాసార్థం ఉన్న స్టీల్ పైపును శిథిలాల ద్వారా 39 మీటర్లు లోపలికి చొప్పించారు.
మరో 14 మీటర్లే.. గురువారం నాటికి పని పూర్తి!
Uttarakhand Tunnel Collapse Latest News :గురువారం నాటికి మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి.. ఆ పైపు ద్వారా కూలీలనుబయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు. మరో, 14 మీటర్లు పైపును చొప్పిస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని భాస్కర్ తెలిపారు.
డ్రిల్లింగ్ మళ్లీ షురూ
ఆగర్ యంత్రం ఏదో గట్టి వస్తువును ఢీకొనడం వల్ల శుక్రవారం సొరంగం వద్ద డ్రిల్లింగ్ నిలిపివేశారు. మళ్లీ మంగళవారం రాత్రి నుంచి డ్రిల్లింగ్ చేపట్టారు. పనులు ఆశావహంగా సాగుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ చెప్పారు. మధ్యలో ఎలాంటి అవాంతరం రాకుంటే 24 గంటల్లోపు మంచి వార్త వింటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం రాత్రి 6 అంగులాల వ్యాసమున్న గొట్టం ప్రవేశపెట్టినప్పటి నుంచి కార్మికులతో మాట్లాడే సౌలభ్యం కలిగింది. ఆ గొట్టం ద్వారా వారికి వేడివేడి ఆహార పదార్థాలను పంపుతున్నారు. నిరంతరం వారితో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.