Uttarakhand Tunnel Collapse Rescue :ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగంలో 9 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూలీల భద్రత కోసం సొరంగం లోపల ఆరు అంగుళాల వెడల్పు ఉన్న పైపును ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐడీసీఎల్ (NHIDCL) డైరెక్టర్ అన్షు మనీశ్ ఖల్ఖో వెల్లడించారు. అంతేకాకుండా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) తయారు చేసిన 20, 50 కిలోల చొప్పున బరువున్న 2 రోబోలను కూడా సొరంగం లోపలికి పంపినట్లు ఆయన తెలిపారు. ఇవి లోపల ఉన్న వారికి ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ప్రత్యేకంగా వెంటిలేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నాయని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు రప్పించేందుకు ఇరువైపులా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
"మేము మా మొదటి పురోగతిని సాధించాం. ఇందుకోసం మేము గత 9 రోజులుగా శ్రమిస్తున్నాం. కార్మికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యత. ఇందులో భాగంగా తాజాగా 6-అంగుళాల పైపును అమర్చి వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారానే వారికి ఆహారం, వైద్య సామగ్రిని అందిస్తున్నాం."
- అన్షు మనీశ్ ఖల్ఖో, ఎన్హెచ్ఐడీసీఎల్ డైరెక్టర్
'ఆహారంతో మానసికంగా ధృడమవుతారు..'
'రోబోలను లోపలికి ప్రవేశపెట్టడం అనేది మేము సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నాం. ఇప్పుడు వారిని బయటకు తెచ్చేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలు సఫలీకృతమైతే మాకు అది రెండో విజయం. దీన్ని అమలుపరచడం చాలా కీలకమైన అంశం. పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాం. దీంతో వారు మానసికంగా కొంత మెరుగవుతారు. వారితో కమ్యునికేట్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం' అని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు.