Uttarakhand Tunnel Collapse Rescue :ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ సొరంగంలోని శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఐదో రోజు రెస్క్యూ ఆపరేషన్ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనేక గంటలుగా శ్రమిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
"మాకు ప్రభుత్వపరంగా పూర్తి మద్ధతు లభిస్తోంది. భారీ డ్రిల్లింగ్ యంత్రాలను అమర్చి ఈ రెస్క్యూ ఆపరేషన్ను 99.99% విజయవంతంగా పూర్తిచేస్తామనే నమ్మకముంది. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించొద్దని అందరినీ కోరుతున్నాను. టన్నెల్‌లో శిథిలాల కింద ఉన్నవారందరూ సురక్షితంగానే ఉన్నారు. వారికి ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదు. అయినప్పటికీ వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచాం.
- గిర్దారిలాల్, ఎన్హెచ్ఐడీసీఎల్ పీఆర్వో
దిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ యంత్రాలు..
రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా దిల్లీ నుంచి విమానంలో భారీ డ్రిల్లింగ్ యంత్రాలు తీసుకువచ్చామని ఎన్హెచ్ఐడీసీఎల్ అధికారి తెలిపారు. డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. అధికారులతో సమీక్షించారు.
రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని డిమాండ్
రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగవంతం చేయాలని సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు డిమాండ్ చేశారు. తమ సహాద్యోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెస్య్యూ ఆపరేషన్ను త్వరగా పూర్తిచేసి తమ తోటి ఉద్యోగులను కాపాడాలని కోరుతూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.