Uttarakhand Tunnel Collapse Latest News :10 రోజులు.. 41 మంది కార్మికులు.. అనూహ్యంగా సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. కేవలం డ్రై ఫ్రూట్సే కాకుండా వేడివేడి కిచిడీతోపాటు ఇతర ఆహార పదార్థాలు అందిస్తోంది. అసలు వారు లోపల ఎలా ఉన్నారు? ఆహారం ఎలా అందుకుంటున్నారు? వేడివేడి కిచిడీని ఎలా పంపారు అధికారులు? వైద్యుల సలహాల మేరకే ఆహారాన్ని పంపుతున్నారా? కూలీలతో అధికారులు ఎలా మాట్లాడుతున్నారు?
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పగలురాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో చేపడుతున్న సహాయక చర్యల్లో భారీ విజయం సాధించారు. ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని.. సొరంగ శిథిలాల ద్వారా పంపించగలిగారు. దాని ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. లోపల ఉన్న కార్మికులను ప్రత్యక్షంగా చూశారు.
తొలిసారి వేడి ఆహారం..
సొరంగం కూలిన ఘటన తర్వాత నాలుగు అంగుళాల గొట్టపు మార్గం ద్వారా కేవలం డ్రైఫ్రూట్సే పంపిన అధికారులు.. తొలిసారి వేడివేడి ఆహారాన్ని కూలీలకు అందించారు. వెడల్పు అయిన వాటర్ బాటిళ్లలో కిచిడీని నింపి.. ఆరు అంగుళూల వ్యాసం పైపు ద్వారా అధికారులు పంపారు. పలువురు వంట మనుషులు.. కూలీలకు అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు.
"కూలీలకు అందించేందుకు వేడివేడి కిచిడీని తయారు చేశాం. బాటిళ్లలో నింపి అధికారులకు అందించాం. అధికారులు చెప్పినట్లే ఆహారాన్ని సిద్ధం చేశాం. కిచిడీ తర్వాత పప్పును కూడా పంపాం"
-- హేమంత్, వంట మనిషి
మనిషికి 750 గ్రాముల చొప్పున..
సొరంగంలో ఉన్న కూలీల ఒక్కొక్కరికి 750 గ్రాముల చొప్పున ఆహారాన్ని సిద్ధం చేస్తున్నామని మరో వంట మనిషి రవి రాయ్ తెలిపారు. ముందు కిచిడీ పంపామని, తర్వాత నారింజ, యాపిల్స్ పంపుతామని చెప్పారు. నిమ్మరసాన్ని కూడా పంపనున్నట్లు వెల్లడించారు.
వైద్యుల సలహాల మేరకే ఆహారాన్ని పంపుతున్నారా?
41 మంది కూలీల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. వైద్యుల సహకారంతో రెస్క్యూ అధికారులు.. జాబితాను సిద్ధం చేశారు. తక్షణ బలాన్నిచ్చే అరటిపండ్లు, యాపిల్స్, డలియా వంటి పంపుతున్నారు.
"టన్నెల్లో ఉన్న కూలీలను ఎలాంటి ఆహారం పంపించాలో వైద్యుల సహకారంతో జాబితా సిద్ధం చేశాం. ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టం ద్వారా వైద్యుల సూచించిన ఆహార పదార్థాలను పంపిస్తున్నాం. సహాయక చర్యల్లో కీలక పురోగతి సాధించాం. దీని తర్వాత టన్నెల్లో ఆనంద వాతావరణం నెలకొంది"