Uttarakhand Tunnel Collapse Latest News :ఉత్తరాఖండ్.. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డ్రిక్స్ రంగంలోకి దిగారు. సిల్‌క్యారాలోని సొరంగం కూలిన ప్రదేశంలో ఆయన తనిఖీలు చేపట్టారు. కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలిపారు.
"మా బృందమంతా ఇక్కడ ఉంది. సొరంగం లోపల చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు మార్గాన్ని కనుగొన్నాం. త్వరలోనే బయటకు తీసుకురాబోతున్నాం. కూలీలే కాకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేవాళ్లు కూడా సురక్షితంగా ఉండడం ముఖ్యమే. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అద్భుతంగా జరుగుతోంది. ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. కూలీలకు ఆహారం, మందులు సక్రమంగా అందుతున్నాయి" అని అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు.
సహాయక చర్యలపై మోదీ ఆరా..
సొరంగం వద్ద సహాయక చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మోదీ ఫోన్లో మాట్లాడారు. అవసరమైన రెస్క్యూ పరికరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. కార్మికుల మనోధైర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పినట్లుగా ఉత్తరాఖండ్ సీఎంవో తెలిపింది.
ఒక్కరోజులోనే..
సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలను కాపాడేందుకు అధికార యంత్రాంగం.. ఆదివారం మరో ప్రత్యామ్నాయ మార్గంతో రంగంలోకి దిగింది. నిట్టనిలువునా డ్రిల్లింగ్ చేసి పైపులను దించేందుకు కొండపైభాగానికి చేరుకునేలా రహదారిని ఒక్కరోజులోనే నిర్మించింది. సొరంగం లోపల ఉన్న కూలీలకు తగిన ఆహారాన్ని, అవసరమైన ఇతర సామగ్రిని సరఫరా చేయడానికి వీలుగా వెడల్పు అయిన గొట్టాలను శిథిలాల ద్వారా 42 మీటర్ల పొడవునా చొప్పించారు అధికారులు. సహాయం అందించడానికి ఇది రెండో మార్గంగా ఉపయోగపడుతోందని తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన వారు సహా సీనియర్ అధికారులు సిల్‌క్యారాలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంతవరకు జరిగిన ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడం వల్ల ఐదు ప్రణాళికల్ని సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నారు.
నాలుగైదు రోజుల్లోనే మంచి ఫలితాలు..
Uttarakhand Tunnel Latest News : సిల్‌క్యారా, బార్కోట్ వైపుల నుంచి ఏకకాలంలో మార్గాన్ని తవ్వే పనులు ఆదివారం రాత్రి మొదలయ్యాయి. 75 టన్నుల పరికరాలను రైలుమార్గం ద్వారా ఘటనాస్థలానికి తరలిస్తున్నారు. తాజా ప్రయత్నాల వల్ల నాలుగైదు రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ, ప్రధాని మాజీ సలహాదారుడు భాస్కర్ ఖుల్బే తెలిపారు. సొరంగం పైభాగానికి, శిథిలాలకు మధ్యనున్న ఖాళీ స్థలం నడుమ గొట్టపు మార్గాన్ని ఏర్పాటు చేయవచ్చా లేదా అనేది రోబో ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.
'ఎలాంటి పురోగతి లేదు'
Tunnel Collapse In Uttarkashi :మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి పురగోతి లేదని కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరు ఆరోపించారు. పరికరాలు ఇంకా రాలేదని చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో తమను మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరినా.. కార్మికులను బయటకు తీసుకురాకపోవడం వల్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 12వ తేదీ నుంచి కూలీల కుటుంబసభ్యులు.. సొరంగం బయటే వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొరంగం కూలిన ప్రాంతానికి ఆదివారం వెళ్లారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'ఒక్కదాన్నీ వదలిపెట్టం'
Uttarakhand Tunnel Wikipedia :సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తామని, ఏ ఒక్కదాన్నీ వదిలివేయబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మట్టి స్వభావం ఏకరీతిన లేకపోవడం వల్ల సహాయక చర్యలొక సవాల్‌గా మారాయన్నారు. ఒకవైపు నుంచి మరోవైపునకు తవ్వుకుంటూ వెళ్లడానికి అమెరికా నుంచి రప్పించిన యంత్రం మెత్తని నేలలో బాగా పనిచేస్తున్నా, శిలలవంటివి ఎదురైనప్పుడు ఒత్తిడి పెంచితే తీవ్రంగా ప్రకంపనలు వెలువడుతున్నాయని విలేకరులకు వివరించారు. అయినప్పటికీ ఈ పనిలో రెండున్నర రోజుల్లో ఫలితం సాధించగలమని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే గడ్కరీ మీడియా సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. రెడ్ కార్పెట్‌ను పరిచి ఏర్పాట్లు చేసింది. దీంతో కూలీలు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు కూలీల క్షేమం కన్నా రెడ్ కార్పెట్ ఏర్పాట్లు ముఖ్యమని మండిపడ్డారు.
'మరో రెండు రోజులు సొరంగంలోనే కూలీలు! పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహారం సరఫరా'
'సొరంగంలోని కూలీల ప్రాణాలకు ముప్పు- రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాల్సిందే!'