తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐదేళ్ల సీఎం కావాలి.. స్థిరమైన ప్రభుత్వం రావాలి'

Uttarakhand polls 2022: ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు.. ఇదీ ఉత్తరాఖండ్‌లో పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాటకంలో కృష్ణ పాత్రధారుల్లా సీఎంలు పదే పదే మారడం ఆ రాష్ట్రంలో ఆనవాయితీగా మారిపోయింది. అందుకే సోమవారం (ఫిబ్రవరి 14న) ఒకే దశలో జరిగే శాసనసభ  ఎన్నికల్లోనైనా.. ఐదేళ్లు పదవీకాలం పూర్తిచేసే ఒక మారని కృష్ణుడి(సీఎం)ని, స్థిరమైన ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందా?

Uttarakhand polls 2022
ఉత్తరాఖండ్​ పోల్స్​

By

Published : Feb 13, 2022, 8:01 AM IST

Uttarakhand polls 2022: ఉత్తరాఖండ్‌ ప్రజల నోళ్లలో నానుతున్న ప్రశ్న ఒక్కటే.. ఈసారైనా పూర్తి కాలం అధికారంలో ఉండే ముఖ్యమంత్రి, స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా...? ఎందుకంటే 2000వ సంవత్సరంలో రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్‌ ఇప్పటివరకు పది మంది సీఎంలను చూసింది. ఇద్దరే మూడేళ్ల కంటే ఎక్కువకాలం బాధ్యతలు నిర్వహించారు. అందులో ఒకరు నారాయణ్‌దత్‌ తివారీ (2002,మార్చి 2- 2007, మార్చి 7), మరొకరు త్రివేంద్రసింగ్‌ రావత్‌ (2017 మార్చి 18- 2021 మార్చి 19). ఇందులో తివారీ ఒక్కరే పదవీకాలం పూర్తి చేసిన సీఎం. ఆసక్తికరమేంటంటే అయితే కాంగ్రెస్‌.. లేకపోతే భాజపాకు చెందిన సీఎంలనే గద్దెనెక్కించిన 70 సీట్ల శాసనసభలోని సభ్యులు.. రెండు పార్టీలకు చెందిన సీఎంలపైనా ఎన్నడూ సంతృప్తిగా లేకపోవడం.

.

4 నెలల్లోనే ముగ్గురు సీఎంలు

2017 శాసనసభ ఎన్నికల్లో భాజపా 57 సీట్లు నెగ్గి అధికారం చేజిక్కించుకుంది. సీఎంగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నియామకాన్ని పార్టీ శ్రేణులు స్వాగతించాయి. మూడేళ్లలో పరిస్థితి తలకిందులైంది. ఆయన పనితీరుపై సొంత పార్టీలోనే అసమ్మతి రేగింది. దీంతో రావత్‌ను కొనసాగిస్తే పార్టీ మనుగడకే ప్రమాదమని భాజపా అగ్రనేతలు భావించారు. ఆయనను తొలగించి.. సీఎంగా తీరథ్‌ సింగ్‌ రావత్‌ను నియమించారు. ఈయనైనా దీర్ఘకాలం ఉంటారని ప్రజలు భావించారు. కానీ నాలుగు నెలలు ముగియకముందే రావత్‌నూ భాజపా అధిష్ఠానం సాగనంపింది. జులై 4, 2021న యువకుడైన ప్రస్తుత సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎంపిక చేసింది. దీంతో నాలుగు నెలల వ్యవధిలో ఉత్తరాఖండ్‌ ప్రజలు ముగ్గురు సీఎంలను చూశారు.

'హరిద్వార్‌' ఊసే లేదు

నిరుడు డిసెంబర్‌లో హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో కొందరు వక్తలు విద్వేష ప్రసంగాలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా వివాదమైంది. దీంతో ఈ అంశం అసెంబ్లీ ఎన్నికల్లో దుమారం రేపుతుందని, కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని అంచనా వేశారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ‘హరిద్వార్‌’ ఊసే లేదు. కాంగ్రెస్సే కాదు.. ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతోంది. ప్రధాని మోదీ.. తన ప్రచారంలో రాష్ట్రానికి భాజపా చేసిన అభివృద్ధితో పాటు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ విమర్శలు కూడా గుప్పించింది.

మతం, కులం ప్రభావం అంతంతే..

యూపీ రాజకీయాలు.. మత, కుల సమీకరణాలతోనే ముడిపడి ఉంటాయి. యూపీ నుంచి విడిపోయి రాష్ట్రంగా ఆవిర్భవించిన ఉత్తరాఖండ్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ మతం, కులం అంతగా ప్రభావం చూపవు. కొన్ని జిల్లాల్లోనే ముస్లింలు ఉన్నారు. దళితులూ 20%లోపే. గతంలో దళిత ఓటర్లను ఆకర్షించేందుకు బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రయత్నించినా.. పెద్దగా విజయం సాధించలేదు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపా పార్టీ మధ్య పెద్దగా తేడా కూడా ఉండదు. రెండు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లు, నాయకత్వలేమి కనిపిస్తాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఎం ధామి విషయానికొస్తే.. ఆయన యువ నాయకత్వం.. అసంతృప్త శాసనసభ్యులను సంతృప్తిపరచటానికి ఆయన అనుసరించిన విధానాలపై భాజపా సంతోషంగా ఉంది. పార్టీ మళ్లీ నెగ్గితే ఆయనే సీఎం అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ తన పేరును సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి:'అధికారంలోకి వస్తే.. యూనిఫామ్ సివిల్​ కోడ్​ను అమలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details