Uttarakhand Polls 2022: తండ్రుల ఓటమికి ప్రతీకారంగా బరిలోకి దిగుతున్నారు ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ మాజీ సీఎంల పుత్రికలే. అంతేకాదు వీరు ఎదుర్కొంటున్న ప్రత్యర్థులు కూడా నాడు తండ్రిని ఓడించిన వారే కావడం గమనార్హం. ఇందులో ఒకరు కోటద్వార్ నుంచి పోటీ చేస్తున్న రీతూ ఖండూరీ భూషణ్. ఈమె భాజపా మాజీ సీఎం మేజర్ జనరల్ భువన చంద్ర ఖండూరీ కుమార్తె. 2012 ఎన్నికల్లో భువనచంద్ర.. కోటద్వార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ నేగి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ నేగీకి వ్యతిరేకంగా రీతూ బరిలోకి దిగారు. తన తండ్రి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమా రావత్ కథ కూడా ఇలాంటిదే. 2017లో హరిద్వార్ రూరల్‌లో భాజపా అభ్యర్థి స్వామి యతీశ్వరానంద్ చేతిలో హరీశ్ రావత్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై, అదే హరిద్వార్ రూరల్‌లో అనుపమ పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు తమ తండ్రులకు జరిగిన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అన్నదే ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్‌లోనే తేలనుంది.