కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సాధారణ ప్రజలైతే సరేసరి.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఓ మంత్రి అయితే మాస్కును ఏకంగా కాలి బొటనవేలికి తగిలించి మీటింగ్‌లో పాల్గొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లో భాజపాకు చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికీ మాస్కులు లేవు. మంత్రి యతీశ్వరానంద్ మాస్కును ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.