అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం విషయంలో అధికార భాజపాకు మరోమారు చిక్కులు మొదలయ్యాయి. త్రివేంద్ర సింగ్ రావత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమైన క్రమంలో.. తీరథ్ సింగ్ రావత్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది అధిష్ఠానం. అయితే.. తీరథ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించిన మూడు నెలల్లోనే మరోమారు సీఎం మార్పుపై వార్తలు రావటం గమనార్హం. భాజపా హైకమాండ్ తీరథ్‌ను అత్యవసరంగా దిల్లీ పిలిపించటంతో ఆ ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దిల్లీలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు హాజరైన ఈ భేటీ అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి చెందటం వల్ల ఖాళీ ఏర్పడిన హల్ద్వానీ, గంగోత్రి సీట్లపై చర్చించినట్లు సమాచారం. అలాగే భవిష్యత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిస్తేనే..
త్రివేంద్ర సింగ్ రావత్‌ను సీఎంగా తొలగించిన అనంతరం లోక్ సభ సభ్యుడైన తీరథ్ సింగ్ రావత్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ ఏడాది మార్చిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తీరథ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9లోపు అది పూర్తికావాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించలేమని మే 5నే తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు.. ఏడాది లేదా ఆలోపే ఏ రాష్ట్రంలోనైనా సాధారణ ఎన్నికలే జరగాలని తెలిపింది. ఈ కారణంతో రాష్ట్రంలో ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో భాజపా అధిష్ఠానం వద్ద ఉన్న ఒకే ఒక అవకాశం ముఖ్యమంత్రిని మార్చటం.
తీరథ్ సింగ్ రావత్ సాల్ట్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఉంటే.. ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.