Uttarakhand Landslide : ఉత్తరాఖండ్‌లో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ధామ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడి 13 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో కీలకమైన గౌరీకుండ్‌లో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా విరిగిపడ్డ కొండచరియలు.. స్థానికంగా ఉన్న మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 13 మంది గల్లంతయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. బాధితులు బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితుల్లో చాలా మంది నేపాల్ మూలాలున్నవారు ఉన్నారని స్థానికులు తెలిపారు. వీరంతా ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదని వారు వాపోయారు. బాధితులు మందాకిని నదిలో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.