ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బుధవారం ఆమె రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్ అధికారి ఒకరు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారి పేర్కొన్నారు.
బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పాల్ పదవీకాలం ముగిసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం బేబీ రాణి మౌర్యను గవర్నర్‌గా నియమించింది.
రాజీనామా అందుకేనా?
పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే బేబీ రాణి మౌర్య వైదొలగడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (2022) సమీపిస్తున్న నేపథ్యంలో అమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
గవర్నర్‌గా నియమితులవడానికి ముందు బేబీ రాణి మార్య భాజపా తరఫున క్రియాశీల రాజకీయాల్లో పలు కీలక పదవుల్లో పని చేశారు. 1995 నుంచి 2000 వరకు ఆగ్రా మేయర్‌గా బాధ్యలు నిర్వహించారు. ఆ తర్వాత 2002-2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎత్మాద్పూర్ నియోజగవర్గం నుంచి 2007లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు బేబీ రాణి మార్య. అయితే బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అ తర్వాత కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యకలాపాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యమే.. అమె తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తారన్న ప్రచారానికి తావిస్తోంది.
ఇదీ చదవండి:భాజపా ఎంపీ ఇంటిపై బాంబు దాడి- గవర్నర్ ఆందోళన