ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన జల ప్రళయ ఘటనలో.. శనివారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 65కు చేరింది. తపోవన్ హైడల్ ప్రాజెక్టులో సొరంగంలో ఈ మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో 139 మంది ఆచూకీ తెలియాల్సింది ఉందన్నారు.
జలప్రళయ ఘటన జరిగి 13 రోజులు దాటినా.. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యారేజ్ నుంచి ధౌలీగంగా నదీ జలాలు సొరంగంలోకి వస్తున్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారుతున్నాయని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ స్వాతి ఎస్ భదౌరియా తెలిపారు. మరిన్ని పరికరాల సాయంతో నదీ ప్రవాహ దిశను మార్చి, గాలింపు చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. రైనీ గ్రామంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని చెప్పారు.