Uttarakhand results 2022: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కాంగ్రెస్‌లో దిగ్గత నేత. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలపండిన నాయకుడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం ఆయన సొంతం. కేంద్రమంత్రిగానూ సేవలందించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న రావత్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారు. ఉత్తరాఖండ్ లాల్కువా నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి మోహన్ భిష్ఠ్ చేతిలో 14వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. సొంత రాష్ట్రంలోనే కాదు పంజాబ్‌లోనూ కాంగ్రెస్ ఓటమికి ఆయనే కారణమనే అపవాదు మూటుగట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు.
తాను ఓడటమే గాక కాంగ్రెస్‌నూ..
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరి సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు గుప్పించారు. అమరీందర్‌పై సిద్ధూ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను సీనియర్ నేత అయిన హరీశ్ రావత్‌కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. 2017 నుంచి అసోం, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించలేకపోయారు. పైగా అమరీందర్ సింగ్‌కు రావత్‌కు అసలు పడదనే ప్రచారం కూడా ఉంది. దీంతో సంక్షోభం మరింత ముదిరి అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు వర్గానికి చెందిన చరణ్‌జీత్ సింగ్ చన్నీని నియమించింది అధిష్ఠానం. అయినప్పటికీ కాంగ్రెస్‌లో వర్గపోరు నడిచింది. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో బరిలోకి దిగి చరిత్ర సృష్టించింది. పంజాబ్‌లో తొలిసారి శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆప్ 90 స్థానాలకు పైగా గెలవగా.. హస్తం పార్టీ కేవలం 15 స్థానాలకే పరిమితమై చేజేతులా పీఠాన్ని కోల్పోయింది.
Uttarakhand election 2022
ఉత్తరాఖండ్‌లోనూ..
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పంజాబ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు రావత్. పూర్తిగా ఆయన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రావత్ పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. దీంతో ఆయన పార్టీకి ఝలక్ ఇచ్చినంత పని చేశారు. ఒకానొక సమయంలో రావత్ పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో అధిష్ఠానం ఆయనను బుజ్జగించింది. సీఎం అభ్యర్థి తానే అనే హామీ పొందిన తర్వాత ఎన్నికల ప్రచారంలో రావత్ చురుగ్గా పాల్గొన్నారు.