ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద మంచు చరియలు విరిగిపడి పెను ప్రమాదానికి దారి తీసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. అసోం పర్యటనలో ఉన్న ప్రధాని.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలు సాగుతున్న తీరుపై ఆరా తీశారు.
షా సమీక్ష..
ఉత్తరాఖండ్ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రావత్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీలతో మాట్లాడారు.
" ఉత్తరాఖండ్ విపత్తుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎస్ రావత్, డీజీలు, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడాను. ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అన్ని విధాల అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నాం."