తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భవనంలో పేలిన గ్యాస్​ సిలిండర్​.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Uttarakhand fire accident
Uttarakhand fire accident

By

Published : Apr 7, 2023, 12:26 PM IST

Updated : Apr 7, 2023, 1:32 PM IST

ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. భవనంలో ఎక్కువ భాగం చెక్కతో చేసి ఉండడం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయని అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ప్రమాదానికిి గురైన భవనంలో రెండు కుటుంబాలు ఉంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లలోని నలుగురు తప్పించుకున్నారు. మరో నలుగురు చిన్నారులు అధిరా, వికేశ్‌, త్రిలోక్‌, జైలాల్‌.. భవనం లోపలే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. కానీ అప్పటికే భవనంలోని నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు.

"అగ్ని ప్రమాదం నుంచి పెద్దలు సురక్షితంగా బయటపడ్డారు. దురదృష్టశాత్తు నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి దాదాపు 5 గంటలకు పైగా సమయం పట్టింది."

--అధికారులు

విచారం వ్యక్తం చేసిన సీఎం..
మరోవైపు.. ఈ అగ్ని ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం..
బంగాల్​.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సంతోష్​పుర్​ రైల్వే స్టేషన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలు ఆర్పిన అనంతరం రైళ్లు యథాతథంగా కొనసాగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన.

'ఫ్లాట్​ఫాంపై ఉన్న 20 దుకాణాలు కాలిపోయాయి. రైల్వే ఆస్తికి ఎటువంటి నష్టం కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నాం. ఏడు అగ్నిమాపక యంత్రాలు మూడు గంటల కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయి.'

--రైల్వే అధికారులు

క్లాత్​ మార్కెట్​లో అగ్ని ప్రమాదం..
గత నెల మార్చిలో ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాన్పుర్​ నగంలోని అన్వర్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధి బన్స్​మండిలో ఉన్న క్లాత్​ మార్కెట్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 500 దుకాణాలు దగ్ధమయ్యాయి. దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈద్​ సీజన్​ సందర్భాంగా నిల్వ ఉంచిన స్టాక్​ మొత్తం కాలిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్ మీద క్లిక్​ చెయ్యండి.

Last Updated : Apr 7, 2023, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details