Uttarakhand Election 2022: భాజపా, కాంగ్రెస్‌ల మధ్య వంతులవారీగా అధికారం చేతులు మారే రాష్ట్రంగా పేరున్న ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం సీఎం పుష్కర్‌సింగ్ ధామీ, మాజీ సీఎం హరీశ్ రావత్‌ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది! వీరిద్దరూ ఏ నియోజకవర్గంలోనూ నేరుగా తలపడటం లేదు. కానీ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయం సాధించిపెట్టాల్సిన గురుతర బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. సీఎం పీఠమెక్కిన దాదాపు ఆరు నెలలకే ధామీ ఈ ఎన్నికలను ఎదుర్కొంటుండగా.. కాంగ్రెస్ తరఫున చావో రేవో తేల్చుకునేందుకు అపార అనుభవశాలి రావత్ సిద్ధమయ్యారు.
రావత్: ప్రజాదరణలో ముందంజ
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన రెండు స్థానాల్లోనూ హరీశ్ రావత్ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఈయన కొనసాగుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 'సీఎంగా ఎవరుంటే బాగుంటుంది' అన్న అంశంపై ఉత్తరాఖండ్‌లో ఇటీవల నిర్వహించిన పలు ఒపీనియన్ పోల్స్‌లో ఈయన వైపే అత్యధికులు మొగ్గుచూపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ భాజపా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంపై ఎన్నికల ప్రచారంలో రావత్ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారే సంప్రదాయం కూడా ఈ దఫా తమకు అనుకూలంగా ఉండటంతో ఎన్నికల్లో విజయంపై 73 ఏళ్ల రావత్ విశ్వాసంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథిగా ఉన్న ఈయన.. లాల్‌కువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ధామీ: చరిత్రను తిరగరాస్తారా?