భారత్‌లో హిందూ, ముస్లింలు వేర్వేరు కాదని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో రాష్ట్రీయ ముస్లిం మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భగవత్ పాల్గొన్నారు. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే అని అభిప్రాయపడ్డారు.
పూజించే విధానాన్ని బట్టి ప్రజలను వేరుగా చూడలేమని భగవత్ స్పష్టం చేశారు. మతం పేరుతో దాడులు చేసే వారు హిందూ వ్యతిరేకులు అని అన్నారు. ప్రజల మధ్య ఐక్యత లేనిదే దేశం అభివృద్ధి చెందదన్నారు.
"సంఘటిత సమాజ అస్తిత్వం లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదు. సంఘటిత సమాజం అంటే ఆత్మీయతతో ముడిపడిన సమాజం. హిందూ, ముస్లిం ఐక్యత ఓ భ్రమ అని మా ఆలోచన. ఎందుకంటే వారిని ఏకం చేయడం ఏమిటి? వారు కలిసే ఉన్నారు. ఐక్యంగా లేము అని భావిస్తే రెండు వర్గాలు ఇబ్బందుల్లో పడతాయి. సంఘ్ వారు తమను కబళిస్తారని మైనార్టీల్లో భయం పట్టుకుంది. హిందూ మెజార్టీ దేశాల్లో ఉంటే ఇస్లాం అంతం అవుతుందనే భయం కూడా వారిలో ఉంది. వేరే ఇతర దేశాల్లో అలా జరిగితే జరిగి ఉండవచ్చు. కాని మన దేశంలో మాత్రం అలా జరగదు.