uttarakhand cloudburst 2022 : ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఆకస్మికవరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ సరిహద్దు వద్ద భారీ నష్టాన్ని మిగిల్చాయి. పితోరాఘర్ జిల్లాలోని ఖొటిలా గ్రామంలో కాళి నది మహోగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతంలో ఉన్న 36 ఇళ్లను ముంచెత్తింది. ఈ ఘటనలో పశుపతి దేవి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా కొండచరియలు నదిలో పెద్ద ఎత్తున కొట్టుకువచ్చాయి. ఖొటిలా గ్రామంలో 170 మందిని ఖాళీ చేయించి సమీపంలోని పునరావాస శిబిరానికి తరలించారు.
నేపాల్ సరిహద్దుల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నేపాల్ వైపు కూడా ప్రాణనష్టం సంభవించింది. వరద ప్రభావిత ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల ధాటికి రోడ్లే కాకుండా తాగునీటి పథకాలు కూడా ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల పొలాలు సైతం దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో ప్రవహించే కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఫుట్‌పాత్‌లపైనా వర్షం నీరు భీకర రూపంలో ప్రవహిస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్ ఘాటిలో కుండపోత వర్షం భారీ విధ్వంసం సృష్టించింది. ఉఖీమత్ ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా నదులు ఉప్పొంగాయి. ఉఖిమత్ కుండ్, మినీ స్విట్జర్లాండ్ చోప్తాను కలిపే మోటర్ వే చాలా చోట్ల దెబ్బతింది. వర్షం కారణంగా కేదార్‌నాథ్ హైవేపై చెత్తాచెదారం వచ్చి చేరింది.