ఉత్తర్ ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంగి గ్రామంలో వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ఓ లారీ అదుపు తప్పిన రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదానికి ముందు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో పంగి ఖుర్ద్ గ్రామ సమీపంలోని పిలిభిత్ బస్తీ రహదారిపై బహ్రైచ్ వైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు ఘటనా స్థలం చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో బహ్రెయిచ్ నుంచి వేగంగా వస్తున్న లారీ జనాలపైకి దూసుకెళ్లి కాలువలో పడింది. దీంతో ఆరుగురు మరణించగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.