వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్‌ప్రదేశ్‌లో (UP elections 2022) అయోధ్యే కీలకమైన ప్రచారాస్త్రం కానుంది. బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు (ayodhya verdict) వెలువడిన తర్వాత యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ప్రచారంలో అయోధ్య రామాలయమే ముఖ్యమైన అంశంగా నిలుస్తుందనే సంకేతాలు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధే మిగిలి ఉంది. భాజపా, ఎస్పీ, బీఎస్సీ సహా పలు పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని (UP election campaign) ఈ అంశంతోనే ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం అయోధ్య అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు.
ఎన్నికల కోణంలో కాదు...
అయోధ్యలో రామాలయం తమకు ఎప్పటికీ ముఖ్యమేనని, దానిని ఎన్నికల కోణంలో చూడడం లేదని భాజపా యూపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా చెబుతున్నారు. దళితులు, బ్రాహ్మణుల మద్దతు పొంది 2007 మాదిరి విజయాన్ని మరోసారి సాధించాలని బహుజన్‌సమాజ్ పార్టీ ఆశపడుతోంది.